
సాక్షి, అమరావతి: పంటల సేకరణలో రైతులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 155251 నంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 10,641 రైతుభరోసా కేంద్రాలను (ఆర్‌బీకేలను) వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పంటల సేకరణకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అన్ని ఆర్‌బీకేలు కొనుగోలు కేంద్రాలుగా పనిచేస్తాయని, అవసరమైతే వీటికి అనుబంధంగా మరికొన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాస్తవ రైతులకు లబ్ధిచేకూర్చే విధంగా వ్యవసాయశాఖ పంటల సాగు విస్తీర్ణం, రైతుల వివరాలను ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసిందని, ఈ వివరాలన్నీ ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని పేర్కొన్నారు.
వ్యవసాయశాఖ ప్రధానంగా పౌరసరఫరాలశాఖ, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, సీసీఐలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఉద్యాన పంటలను కూడా ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రైతులకు పంటల సేకరణ, ధరలపై అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాలు నిర్మించాలని, విస్త్రత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్‌బీకేలకు ఎలా తెచ్చుకోవాలో, ఏయే ప్రమాణాలు పాటించాలో రైతులకు అర్థమయ్యేలా వీడియోలు ప్రదర్శించి చూపాలని కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సేకరణ చేపట్టాలని, కూపన్ల జారీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల సేకరణ తరువాత రైతులకు ఎన్ని రోజుల్లో నగదు చెల్లిస్తారో స్పష్టంగా తెలపాలని, ఏదైనా సమస్య తలెత్తితే ఎప్పటిలోగా పరిష్కరిస్తారో కూడా చెప్పాలని పేర్కొన్నారు.
పంటల ధరలు, అమ్మిన రైతుల వివరాలు, నగదు చెల్లింపులకు సంబంధించిన వివరాలను అందరికీ తెలిసేలా పారదర్శకంగా రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల సేకరణ కేంద్రాలకు సంబంధించిన వివరాలను మ్యాప్‌ల రూపంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ వద్ద ఉంచాలని, తద్వారా సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో పాల్గొనే అన్ని సంస్థల ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 155251 నంబరుకు కాల్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో కోరారు.