అనంతపురం జిల్లా: కిక్కిరిసిన బస్సులో ఎక్కిన ప్రయాణికురాలు కిందకు దిగే వరకూ ముందుకు పోనంటూ ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ భీష్మచుకోవడంతో దాదాపు అరగంట పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్న అభ్యర్థులూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి నుంచి అనంతపురానికి శుక్రవారం ఉదయం కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది.
రెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే ఒకరిద్దరు కిందకు దిగడంతో అక్కడ మరో ప్రయాణికురాలు ఎక్కింది. ఆ సమయంలో బస్సు డోరు వేయడం ఇబ్బందిగా మారడంతో ఆమెను కిందకు దిగి మరో బస్సులో రావాలని కండెక్టర్, డ్రైవర్ సూచించారు. దీంతో ఆమె వాగ్వాదానికి దిగింది. బస్సు డోరు కూడా సక్రమంగా పడడం లేదని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తన కుటుంబం అన్యాయమవుతుందని డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేస్తూ బస్సును ముందుకు పోనిచ్చేది లేదంటూ భీషి్మంచాడు. ప్రయాణికులు సర్దిచెప్పబోతే వారితో కూడా ఆమె వాగ్వాదానికి దిగింది. దీంతో ఎంసీఏ పరీక్షలకు వెళుతున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు సైతం తమకు ఉదయం 8.30 గంటలకు రైలు ఉందని, మరో 15 నిమిషాల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకోకపోతే రైలు వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీఏ అభ్యర్థులు కల్పించుకుని తమ భవిష్యత్తు ఈ పరీక్షతో ముడిపడిఉందని, సహకరించాలని అభ్యరి్థంచడంతో ఆమె శాపనార్థాలు పెడుతూ బస్సు దిగింది. అనంతరం నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా అనంతపురానికి బస్సు చేరుకోవడంతో బెంగళూరు ప్రయాణికులు గత్యంతరం లేక మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది.


