గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్ర నిధుల్లో కోత | Road construction works Decline under PMGSY in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

గ్రామీణ రోడ్ల నిర్మాణానికి కేంద్ర నిధుల్లో కోత

May 8 2026 5:42 AM | Updated on May 8 2026 5:42 AM

Road construction works Decline under PMGSY in Chandrababu Govt

పీఎంజీఎస్‌వైలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.250 కోట్లే కేటాయించిన కేంద్రం

అన్ని రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల్లో కేవలం 1.4 శాతమే రాష్ట్ర వాటా

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంతో పోల్చితే చంద్రబాబు పాలనలో పీఎంజీఎస్‌వైలో సగానికి తగ్గిన రోడ్ల నిర్మాణం

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులు  తగ్గడంతో కేంద్రం ఈ పథకంలో రాష్ట్రానికి నిధుల కేటాయింపును తగ్గించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో కేంద్రం పీఎంజీఎస్‌వై పథకానికి రూ.17,191 కోట్లు కేటాయించగా.. రాష్ట్రానికి కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ పథకానికి కేంద్రం కేటాయించే నిధుల్లో 60 శాతం కేంద్రం గ్రాంట్‌ కాగా, రాష్ట్రం వాటాగా 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ పథకానికి దేశం మొత్తానికి కేంద్రం చేసిన కేటాయింపుల్లో ఒకటిన్నర శాతం నిధులను కూడా రాష్ట్రానికి కేటాయించలేదు. మార్చి నెలాఖరుతో ముగిసిన గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యం మేరకు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేదని కేంద్రం ఈ ఏడాది నిధుల కేటాయింపులు తగ్గించినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం సగటు గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంతో పోల్చితే చంద్రబాబు ప్రభుత్వ కాలంలో సగానికి సగం తగ్గిపోయింది.

వైఎస్‌ జగన్‌ పాలనలో పీఎంజీఎస్‌వై ద్వారా సగటున ఏడాదికి 900 కిలో మీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం జరగగా... చంద్రబాబు పాలనలో సగటున ఏడాదికి 435 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే... 2019–24 మధ్య కరోనా విపత్తు సమయం మినహా 2021 మార్చి నుంచి 2024 మార్చి వరకు మూడేళ్లలో 2,701 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయింది. అదే చంద్రబాబు హయాంలో గత రెండేళ్లలో (2024–25, 2025–26) కేవలం 871 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1,282 కి.మీ కొత్త రోడ్ల నిర్మాణం కొనసాగగా, 2022–23లో 1,050 కి.మీ రోడ్ల నిర్మాణం జరిగింది. 2023–24 ఏడాదిలో 369 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2024–25లో 387 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తవగా, గత 2025–26 ఏడాదిలో 484 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.

పీఎం – జన్‌మన్‌లో మరో రూ.140 కోట్లు కేటాయింపు 
పీఎం– జన్‌మన్‌ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి మరో రూ.140 కోట్లు, ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ కార్యక్రమం కింద నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.90 కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ పథకాల ద్వారా చేపట్టే రోడ్ల నిర్మాణానికి కేంద్ర వాటాగా 60 శాతం, రాష్ట్ర వాటాగా 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement