
ఐటీ కంపెనీలకు అత్యంత చౌకగా భూములిచ్చేందుకు పాలసీ
మంత్రివర్గం ఆమోదం
సాక్షి, అమరావతి: ఎకరం భూమి కేవలం 99 పైసలకే..! ఐటీ, ఐటీ అధారిత కంపెనీలకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇదే ధరకు భూముల కేటాయింపు!! ప్రముఖ కంపెనీలను ఆకర్షించేందుకు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీని ప్రకారం వాటికి రాష్ట్రమంతటా ఎక్కడైనా సరే ఎకరానికి 99 పైసలు చొప్పున భూమిని విక్రయిస్తారు. విక్రయ ఒప్పందం నుంచి ఆరు నెలల్లో లైసెన్సులు పొందడంతో పాటు నిర్మాణాలు ప్రారంభించాలి. మూడేళ్లలో కనీసం 3,000 ఉద్యోగాలు సృష్టించాలి.
ఫార్చ్యూన్ 500 ర్యాంకింగ్‌ల్లో గత మూడేళ్లలో లిస్టింగ్ లేదా కనీసం ఒక బిలియన్ డాలర్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. ఇక మద్యం దుకాణాలన్నింటికి పర్మిట్స్ రూమ్స్.. 840 బార్లు లాటరీ పద్ధతిలో 2025 నుంచి 20 28 వరకు కేటాయింపులు.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని 22 రిసార్టులు, హోటళ్లు ప్రైవేట్ పరం.. ఐటీ కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు భూములు.. ఏపీఐఐసీ ద్వారా 30 వేల ఎకరాలను సేకరించి అభివృద్ధి చేసేందుకు రూ.7,500 కోట్ల రుణ సమీకరణ..!
ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఇతర కీలక నిర్ణయాల్లో ప్రధానమైనవి. కేబినేట్ భేటీ అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
» రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్స్‌ను అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం. ఈ మేరకు ఎక్సైజ్ విధానంలో మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్. ఒక్కో పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలు. వె య్యి చదరపు అడుగుల్లో పర్మిట్ రూమ్ ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో తాగడంపై ఇప్పటికే 2.7 లక్షల పోలీసు కేసులు నమోదు.
» 2025– 28 నూతన బార్ల విధానానికి మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలోని 840 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించి లాటరీ విధానంలో కేటాయింపు. బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్. పది శాతం బార్లు గీత కార్మికులకు కేటాయింపు. రెస్టారెంట్ ఉండాలనే నిబంధన లేదు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ లైసెన్స్ ఫీజు రూ.35 లక్షలుగా నిర్ణయం. 50 వేల నుంచి ఐదు లక్షల లోపు జనాభా ఉంటే బార్ లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు చెల్లించాలి. ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 75 లక్షలు కట్టాలి. ఏటా లెసెన్స్ ఫీజు పది శాతం పెంపు. నోటిఫైడ్ పర్యాటక ప్రాంతాలు, తిరుపతి విమానాశ్రయం మినహా మిగతా ఎయిర్‌పోర్టుల్లో బార్లకు అనుమతి.
» ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న 22 పర్యాటక హోటళ్లను 33 ఏళ్ల పాటు ప్రైవేట్ హోటళ్లకు లీజుపై ఇచ్చేందుకు ఆమోదం. వాటి నిర్వహణ, కార్యకలాపాలు ప్రైవేట్ హోటళ్ల పరం చేసేందుకు గ్రీన్ సిగ్నల్. ఇప్పటికే హోటళ్ల నిర్వాహకులతో సంప్రదించి సిద్ధం చేసిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలకు ఆమోదం.
» ఈ నెల 15వతేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో మహిళ లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యా నికి కేబినెట్ ఆమోదం. ఈ పథకం నాన్ స్టాప్, అంతర్ రాష్ట్రీయ బస్ సర్వీసులు, ఇతర కేటగిరీలకు వర్తించదు. కాంట్రాక్టు క్యారేజ్, చార్టెడ్ సర్వీస్‌లు, ప్యాకేజ్ టూర్లకు కూడా వర్తించదు. పథకం అమలుకు నెలకు రూ.162 కోట్లు వ్యయం కానుందని, ఏటా 142 లక్షల మంది మహిళలు దీన్ని ఉపయోగించుకుంటారని అంచనా.
» నాయీ బ్రాహ్మణుల అభ్యర్థన మేరకు హెయిర్ కటింగ్ సెలూన్లకు ఇచ్చే ఉచిత విద్యుత్ 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంపు. 40,808 సెలూన్లకు వర్తింపు.
» చేనేత కార్మికులకు త్వరలో నేతన్న భరోసా కింద రూ.25 వేలు సాయం. హ్యాండ్లూమ్స్‌కు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌కు ఆమోదం.
» ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం. ఇందుకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు.
» విద్యుత్ పంపిణీ రంగం పునరుద్ధరణ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఏపీసీపీడీసీఎల్‌కు ఇవ్వాల్సిన రూ.1,029.37 కోట్లు, ఏపీఎస్‌పీడీసీఎల్‌కు ఇవ్వాల్సిన రూ.3,544.57 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణంగా తీసుకునేందుకు, రెండు శాతం కమిషన్‌తో ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం.
» అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కి ఆమోదం. సోషల్ మీడియాకు కూడా విధి విధానాలు రూపొందించాలని మంత్రుల కమిటీకి సూచన
» మావోయిస్టు, అనుబంధ సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
» పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన మంజూరు.
» విద్యా శాఖ 117 జీవోలో సవరణలకు ఆమోదం.
» తిరుపతి గ్రామీణ మండలంలో ఏపీటీఏ భూమి టీటీడీ భూమితో బదలాయింపు, మార్పిడితోపాటు తిరుపతి ఆర్‌ఎస్‌లో 25 ఎకరాల టీటీడీ భూమితో ఎక్స్చేంజ్ డీడ్ అమలుకు వీలుగా గతంలో ఒబెరాయ్ గ్రూప్‌నకు జరిగిన భూ కేటాయింపుల రద్దుకు ఆమోదం.