మటన్‌ , చికెన్‌ అంటే భలేభలే! వారంలో 2, 3 రోజులు ఉండాల్సిందే!

People Of Joint Kurnool District Focus on Non Veg For Nutrition - Sakshi

ప్రతి నెలా 5 వేల టన్నుల వినియోగం

పౌష్టికాహారం కోసం మాంసాహారంపై ప్రజల దృష్టి

పెరిగిన మటన్, చికెన్, చేపల కొనుగోళ్లు

తిండి విషయంలో ఖర్చులకు వెనుకాడని వైనం

ఒకప్పుడు బంధువులు వచ్చినప్పుడో.. ఏదైనా వేడుక జరిగినప్పుడో.. పండుగల సందర్భంలోనో మాంసాహారాన్ని వినియోగించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో నాన్‌వెజ్‌ను ఇష్టంగా తింటున్నారు. ఎలాంటి సందర్భాలు లేకున్నా వారంలో రెండు మూడు రోజులు ‘ముక్క’తో ఎంచక్కా లాగించేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే ‘నీసు’ లేనిదే ముద్ద దిగనివారు కూడా ఉన్నారు.

కర్నూలు (అగ్రికల్చర్‌): జిల్లాలో మాంస వినియోగం ఏడాదికేడాదికి పెరుగుతోంది. చికెన్, మటన్, చేపలపైనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి నెలా రూ.217 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనికి అదనంగా బీఫ్, పోర్క్, గుడ్లు, కంజులు తదితర వాటిపై ప్రతి నెలా మరో రూ.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 46 లక్షలకుపైగా జనాభా ఉంది. ఒక సర్వే ప్రకారం జనాభాలో 85 శాతం మంది మాంసం ప్రియులు ఉన్నారు. ఆదివారం వచ్చిందంటే వీరి ఇళ్లలో నాన్‌వెజ్‌ ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి. కొన్ని కుటుంబాలు వారంలో మూడు నాలుగు రోజులు మాంసాహారాన్ని ఆరగిస్తుండటం విశేషం. 

పోషకాహారం కోసం 
కరోనా వైరస్‌ వ్యాపించిన తర్వాత జిల్లాలో మాంసాహార వినియోగం గణనీయంగా పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్‌ ఏమీ చేయలేదని డాక్టర్లు సూచించారు. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏదో ఒక మాంసం తీసుకోవాలని చెప్పారు. వైరస్‌ తగ్గుముఖం పట్టినా ప్రజలు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండలేకపోతున్నారు. 2020తో పోలిస్తే 10 నుంచి 15 శాతం మాంసం అమ్మకాలు పెరిగాయి. సామాన్య ప్రజలకు చికెన్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. దీంతో మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్‌తో సరిపుచ్చుకుంటున్నారు. 

ప్రతి నెలా 5,440 టన్నుల వినియోగం
మాంసాహారుల్లో 50 శాతం మంది చికెన్, 30 శాతం మంది మటన్, 20 శాతం మంది చేపలు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కోడిమాంసం 2,400 టన్నులు, మటన్‌ 1,440 టన్నులు, చేపలు 1,600 టన్నుల ప్రకారం మొత్తంగా 5,440 టన్నుల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ.217 కోట్లు ఉంటోంది. అంటే ఏడాదికి 65,280 టన్నుల నాన్‌వెజ్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ఏడాదికి మాంసాహారానికే రూ.2,604 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

నాణ్యత తప్పనిసరి 
వినియోగదారులు మాంసం ఏదైనా నాణ్యతను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. పశువైద్యులు ధ్రువీకరించిన తర్వాతనే పొట్టేళ్లను మాంసానికి వినియోగించాల్సి ఉంది. నాణ్యమైన మాంసం విక్రయించే విధంగా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.   

రికార్డు స్థాయిలో ఉత్పత్తి 
జిల్లాలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.  2021–22లో లక్ష్యం 1,03,201 టన్నులు ఉండగా రికార్డు స్థాయిలో 1,09,711 టన్నులు ఉత్పత్తి అయ్యింది. జిల్లాలో ప్రతి నెలా 5,000 నుంచి 6,000 టన్నుల ప్రకారం ఏడాదికి 66 వేల టన్నుల మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చికెన్, మాంసం, చేపలు, గుడ్ల వినియోగం గణనీయంగా పెరిగింది.      
– డాక్టర్‌ రామచంద్రయ్య,జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి, కర్నూలు 

ఇష్టంగా తింటాం  
మాకు మాంసాహారమంటే ఎంతో ఇష్టం. మాంసం, చికెన్, చేపలు  వినియోగిస్తాం. వారంలో రెండు, మూడు రోజులు తీసుకుంటాం. కరోనా మొదలైనప్పటి నుంచి వీటి వినియోగాన్ని పెంచాం. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రధానంగా మాంసాహారంపై దృష్టి పెట్టాం.                   
– ఎం రాజేష్, చౌట్కూరు గ్రామం, మిడుతూరు మండలం 

వినియోగం పెరిగింది 
మేం కొన్నేళ్లుగా చికెన్‌ సెంటరు నిర్వహిస్తున్నాం. 2020 నుంచి చికెన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. కరోనా కంటే ముందుతో పోలిస్తే 10 శాతంపైగా అమ్మకాలు పెరిగాయి. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 500 కిలోల వరకు అమ్మకాలు ఉంటాయి. ఆదివారం 1000 కిలోల వరకు ఉంటాయి. వారం రోజుల్లో వినియోగదారులకు, హోటళ్లకు మేం 3500 కిలోల చికెన్‌ విక్రయిస్తున్నాం. మార్కెట్‌లో కొన్ని నెలలుగా బ్రాయిలర్‌ కోళ్ల కొరత ఉంది. ఇందు వల్ల కిలో చికెన్‌ రూ.300 ప్రకారం విక్రయిస్తున్నాం. వారానికి గుడ్లు 5000 వరకు విక్రయిస్తున్నాం. 
– నాగశేషులు, ప్రకాశ్‌నగర్, కర్నూలు 

అమ్మకాలు ఊపందుకున్నాయి 
కర్నూలులోని మద్దూరునగర్‌లో మాది చిన్న షాపు. ప్రతి రోజు పొట్టేలు మాంసం అమ్ముతాం. కరోనా తర్వాత విక్రయాలు ఊపందుకున్నాయి. సోమవారం నుంచి ఆదివారం వరకు సగటున 150 కిలోల మాంసం అమ్మతున్నాం. పొట్టేళ్ల ధరలు పెరగడంతో కిలో మాంసం రూ.750 ప్రకారం విక్రయిస్తున్నాం. 
– షాకీర్, మద్దూర్‌నగర్, కర్నూలు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top