తమిళనాట విజయ్ గెలుపుతో జనసేన శ్రేణుల్లో అంతర్మథనం
పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఇంకా ‘పొత్తు’ తిరుగుడు పూవు మాదిరే రాజకీయం ఎందుకు?
ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకపోవడం వల్లే రాజకీయంగా ఎదగలేకపోతున్నామని ఆవేదన
సొంతంగా ఎదగడానికి యత్నించకుండా మరో 15 ఏళ్లు పొత్తులే అంటూ పవన్ ప్రకటనలెందుకు?
టీడీపీకి ఊడిగం చేయాల్సిన దౌర్భాగ్యం తమకెందుకని జనసేన శ్రేణుల్లో ఆవేదన
సాక్షి, అమరావతి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య విజయం తర్వాత జనసేన పార్టీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. ఆ రాష్ట్రంలో విజయ్‌కు ఉన్నంత సినిమా గ్లామర్ మన రాష్ట్రంలో పవన్‌కళ్యాణ్‌కూ ఉన్నా.. ఆ స్థాయిలో ఎందుకు ప్రభావం చూపించలేకపోయారనే చర్చ సాగుతోంది. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఒంటరిగా పోటీ చేసి సత్తాచాటి సీఎం కాగలుగుతున్నప్పుడు పార్టీ పెట్టి 12 ఏళ్లయినా పవన్ ఇంకా పొత్తుల జపం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ కి ఊడిగం చేయాల్సిన దుస్థితి తమకేంటని మథనపడుతున్నాయి. ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్నా.. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దక్కుతున్న ప్రాధాన్యం తమకు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల పంపకంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధ పడుతున్నారు. పదవుల సంగతి దేవుడెరుగు కనీస గౌరవమూ దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మిమ్మల్ని టీవీకే జెండా తప్ప మరే జెండా మోయనివ్వను’ అని తన కార్యకర్తలకు టీవీకే అధినేత విజయ్ భరోసా ఇచ్చినట్టు తమ అధినేత పవన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఇంకో 15 ఏళ్లు కూటమి పొత్తు కొనసాగుతోందని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించినప్పటి నుంచి జనసేనలోని పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఇదే విధంగా విస్తృతంగా చర్చసాగుతోంది. విజయ్‌తో పవన్‌ను పోల్చి చూసుకుని సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా విజయ్ అభ్యర్థులను పెట్టి పోటీ చేసి సత్తాచాటిన నేపథ్యంలో ఏపీలో ఉన్న 175 స్థానాల్లో్ల తమ పార్టీ కి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని గతంలో పవన్ అన్న మాటలను గుర్తుచేసుకుని జనసేన నేతలు రగిలిపోతున్నారు.
తొలి నుంచీ పవన్ భయం భయంగానే..
పవన్ తొలి నుంచీ భయం భయంగానే రాజకీయాలు చేస్తూ వచ్చారన్న చర్చ నడుస్తోంది. విజయ్ మాదిరి ధైర్యంగా రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2014లో జనసేన పెట్టిన వెంటనే వచ్చిన ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా టీడీపీ–బీజేపీ కూటమికి మద్దతు తెలిపి పలాయనవాదం అందుకోవడంతోనే ప్రజల్లో పవన్ పలుచనైపోయారనే వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందాలతో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినా.. పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయిన పవన్ ఏమాత్రం ఎందుకు ప్రభావం చూపలేకపోయారన్న చర్చ నడుస్తోంది.
2024 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పడేసిన 21 సీట్లతో సర్దుకుని పోటీ చేసిన పవన్ తనకు బలం లేదని, అన్ని చోట్లా పోటీ చేయడానికి తమకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని ఎన్నికల ప్రచారసభల్లో బేల వచనాలు పలకడాన్ని బట్టి ఎన్నడూ పవన్ రాజకీయంగా ధైర్యం కనబరచలేదని జనసేన శ్రేణులు మథనపడుతున్నాయి. పార్టీ పెట్టిన 12 ఏళ్ల తర్వాత ఇప్పుడూ మరో 15ఏళ్లు పొత్తులే అంటూ చేస్తున్న ప్రకటనలపైనా విస్మయం వ్యక్తమవుతోంది.
తెగువే ‘విజయ్’బావుటా..
తమిళనాడులో విజయ్ చూపిన తెగువే ఆ రాష్ట్రంలో 60 ఏళ్లుగా అధికారం దక్కించుకుంటున్న ద్రవిడ పార్టీ ల పీచమణిచింది. అక్కడ ఉండే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీ లకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన విజయ్ తొలినుంచి ధైర్యంగా ముందడుగేశారు. ఎవరితోనూ ‘పొత్తులు పెట్టుకోనని కరాఖండీగా తేల్చిచెప్పారు. ‘‘ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించను, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయను.’ అంటూ తన అభిమానులు, పార్టీ శ్రేణుల్లోనూ ధైర్యం నింపి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన సినిమాను ఆపినా, లీక్ చేసినా, 20 సీట్లు కూడా రావని ఎద్దేవా చేసినా ధీరుడిగా పోరాడారు. చివరకు అంచనాలను తలకిందులు చేసి అనూహ్యంగా జయకేతనం ఎగురవేశారు.
ఇప్పటికైనా సొంతంగా ఎదిగే ధైర్యముందా?
పవన్ ఇప్పటికైనా ఏపీలో సొంతంగా ఎదిగే ధైర్యం చేస్తారా? విజయ్ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమవుతారా? తెలుగుదేశం కబంధహస్తాల నుంచి బయటకొచ్చి సొంతంగా సత్తాచాటే స్థాయికి ఎదుగుతారా? అనే చర్చ జనసేనలో విస్తృతంగా సాగుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్ల ముందే ఓట్లు చీలనివ్వను అంటూ పొత్తుల బాట పట్టిన పవన్.. అప్పటికే అవసాన దశలో ఉన్న టీడీపీకి ఊపి రి పోసి.. తాను మాత్రం ఎదగలేకపోయారనే భావన జనసేనలో ఇప్పటికీ వ్యక్తమవుతోంది. ఎన్నికల్లోనూ టీడీపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకుని తన ఎదుగుదలకు తానే గండికొట్టుకున్నారనే ఆవేదన వినిపిస్తోంది. ఇప్పటికైనా పవన్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు రాబట్టవచ్చని జనసేన శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఇంకో 15ఏళ్లు పొత్తు అంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై తలలు పట్టుకుంటున్నాయి.
పవన్ తీరే వేరు..
ఏపీలో సినీ గ్లామర్‌తోనే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ తీరు వేరేగా ఉందని జనసేన శ్రేణులే వాపోతున్నాయి. తొలి నుంచి పొత్తుల పేరుతో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూనే ఉన్నారని, జనసేన కార్యకర్తల చేత తెలుగుదేశం జెండాలు మోయిస్తూనే ఉన్నారని వాపోతున్నారు. ఈ విషయంపై జనసేనలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతూనే ఉంది. దీనిపై చాలామంది నేతలు బహిరంగంగానే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.


