ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు ఆర్డినెన్స్‌ జారీ

Ordinance issued for registration of house documents in AP - Sakshi

అసైన్డ్‌ భూముల చట్టానికి సవరణ

29 నుంచి కన్వేయన్స్‌ డీడ్స్‌ జారీ  

ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి భరోసా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలుగా 1977 అసైన్డ్‌ భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఒక ఆస్తిగా వారికి అప్పగించేందుకు ఈ చట్ట సవరణ చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. పేదలు ఒక ఆస్తిలా ఆ స్థలాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

అందులో భాగంగానే ఆ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి, కన్వేయన్స్‌ డీడ్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసమే అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది. కాగా, ఈ నెల 29వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్స్‌ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్‌ చేసేందుకు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వీఆర్‌వోలను ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో నంబర్‌ 36 జారీ చేసింది.

కన్వేయన్స్‌ డీడ్స్‌ ద్వారా పేదలకు భరోసా 
ఇంతకుముందు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై వారికి హక్కులు పొందడానికి 20 ఏళ్ల గడువు ఉండేది. దాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2021లోనే పదేళ్లకు తగ్గించింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి హక్కులు వస్తాయి. గతంలో ఉన్న విధానంలో లబ్ధిదారులకు హక్కులు రావాలంటే వారు లేదా వారి వారసులకు తహసీల్దార్లు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వడం, దాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన తర్వాత హక్కులు కల్పించడం అంతా ఓ పెద్ద ప్రహసనం. అసైన్డ్‌ భూముల రికార్డులు సరిగా లేకపోవడం, అసైన్‌ చేసినప్పుడు ఇచ్చిన డి–పట్టాలు పోవడం వంటి రకరకాల కారణాలతో అసైన్డ్‌ ఇళ్ల పట్టాలపై హక్కులు పొందడం పేదలకు కష్టంగా మారిపోయింది.

ఈ పరిస్థితిని నివారించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చినప్పుడే పేదల పేరు మీద వాటిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది. రిజిస్టర్‌ అయిన వెంటనే వారికి కన్వేయన్స్‌ డీడ్స్‌ జారీ చేయడం వల్ల పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కులు వస్తాయి. తహసీల్దార్ల నుంచి ఎన్‌వోసీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఆ స్థలాలు వారి పేరు రిజిస్టరై ఉండడం, కన్వేయన్స్‌ డీడ్‌లు కూడా ఇవ్వడంతో వాటిని ఆస్తిపత్రాలు (సేల్‌ డీడ్‌)గా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి రిజిస్ట్రేషన్‌ కూడా వారి పేరు మీదే చేయడం ద్వారా మహిళలకు ప్రభుత్వం భరోసా ఇవ్వనుంది. 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top