64 మందిని కాపాడిన సహాయక బృందాలు

NDRF SDRF Air Force teams rescued 64 people In flood affected areas - Sakshi

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆగమేఘాలపై సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం 

అలుపెరగకుండా సేవలందిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌ బృందాలు 

సాక్షి, అమరావతి, విశాఖపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు నాలుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 64 మందిని రక్షించారు. వైఎస్సార్‌ జిల్లాలో పాపాగ్ని నది వరదలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రోప్‌ల సాయంతో కాపాడారు. హేమాద్రిపురంలో ఒక సీఐ సహా ఏడుగురిని రక్షించారు. పాపాగ్ని నదికి గండి పడడంతో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తులు, 15 పశువులను ఫైర్‌ సిబ్బంది కాపాడారు. కడప నగరంలో బుగ్గవంక వరద నీటితో నిండిపోయిన ఒక ఇంటి నుంచి గర్భిణిని రక్షించారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతిలో చిక్కుకుపోయిన పది మందిని హెలికాఫ్టర్‌ ద్వారా రక్షించారు.

వైఎస్సార్‌ జిల్లా చెయ్యూరులో వరద నీటిలో ప్రమాదకరంగా చిక్కుకుపోయిన మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మందిని రక్షించారు. 8 ఎన్‌డీఆర్‌ఎఫ్, 9 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఎయిర్‌ ఫోర్స్, ఫైర్‌ సర్వీస్‌ బృందాలు సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నాయి. అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో జల దిగ్భంధమైన వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఉపయోగించారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 243 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20,923 మందిని అక్కడికి తరలించారు. వారికి ఆహారంతోపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.  

వరద సహాయక చర్యల్లో తూర్పు నౌకాదళం   
వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల్లో తూర్పు నౌకాదళానికి చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి ఒక సీకింగ్‌ హెలికాఫ్టర్‌లో నౌకాదళ బృందం బయలుదేరి కడప జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతం, నందలూరు ప్రాంత ప్రజలకు 6,600 ఆహార పొట్లాలు, వాటర్‌ బాటిళ్లు, 3,600 కిలోల రిలీఫ్‌ మెటీరియల్‌ను అందించారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించి, పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. కాగా వరదలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కోస్టుగార్డు బృందాలు చురుగ్గా పాల్గొన్నాయి.   

చిత్తూరు జిల్లాలో 16 సెం.మీ సగటు వర్షం  
నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సగటున 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వైఎస్సార్‌ జిల్లాలో 14.4 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో 12.6, అనంతపురం జిల్లాలో 11.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. భారీ వరదల కారణంగా 24 మంది మృత్యువాతపడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. 1,532 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. 121 చోట్ల రోడ్లకు గండ్లు పడగా, 525 చోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 541 చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. 380 చోట్ల చిన్న నీటి వనరులు దెబ్బతిన్నాయి.

33 కేవీ ఫీడర్లు 85, 33 కేవీ స్తంభాలు 137, 11 కేవీ స్తంభాలు 1307, ఎల్‌టీ స్తంభాలు 1753, 11 కేవీ ఫీడర్లు 592, 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 82 దెబ్బతిన్నాయి. 33 పంచాయతీ రోడ్లు 121 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. తక్షణ అవసరాల కోసం నాలుగు జిల్లాలకు రూ.7 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కలెక్టరేట్లలో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్, ఇతర సౌకర్యాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సహాయక శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top