మెడికల్‌ కాలేజీలు.. అత్యాధునికం

Most Advanced Medical Facilities In Medical Colleges Under Nadu Nedu - Sakshi

ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు–నేడు కింద అత్యాధునిక వైద్య సదుపాయాలు

భారీగా పెరగనున్న పడకల సంఖ్య..

రూ.5,472 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా

ఈ నెలలో జ్యుడిషియల్‌ ప్రివ్యూకు.. వచ్చే నెలలో టెండర్లు ఖరారు  

సాక్షి, అమరావతి:  గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీల్లోనూ అత్యాధునిక వైద్య చికిత్స సదుపాయాలు కల్పించడానికి నాడు–నేడు కింద పనులు చేపట్టేందుకు ఆదేశాలివ్వడం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీల్లో నాడు–నేడు కింద పనుల కోసం రూ.5,472 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేగాక ఈ పనులకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదికలతోపాటు అవసరమైన భూమిని కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇవి ఈ నెలాఖరులోగా జ్యుడిషియల్‌ ప్రివ్యూకు వెళ్లనున్నాయి.

జనవరి నెలాఖరులోగా టెండర్లు ఖరారు అయ్యే అవకాశముంది. రోగులు, వైద్య విద్యార్థులు, డాక్టర్లకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నాడు–నేడు కింద ఈ పనులను చేపడుతున్న విషయం విదితమే. మెడికల్‌ కాలేజీల్లో వైద్య పరికరాలతోపాటు ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి సకల వసతులను కల్పించడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలను ఏడేళ్లపాటు అప్పగించాలని నిర్ణయించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎంఎస్‌ఐడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీలకు సవివరమైన ప్రాజెక్టు నివేదికలను పూర్తి చేశామని, ఈ నెలాఖరులోగా జ్యుడిషియల్‌ ప్రివ్యూకు వెళ్తాయని, జనవరి నెలాఖరుకు టెండర్లు ఖరారు  చేస్తామని వెల్లడించారు.

సకల సదుపాయాలు కల్పిస్తాం
– విజయరామరాజు, ఏపీ ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌
నాడు–నేడు కింద చేపట్టనున్న పనులతో ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీల్లో పడకల సంఖ్య భారీగా పెరుగుతుంది. అలాగే ఆపరేషన్‌ థియేటర్లను అత్యాధునికంగా తీర్చిదిద్దడమేగాక అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుతాం. ఈ కాలేజీల్లో అవసరమైన మరమ్మతులు చేయడమే కాకుండా రోగులు, వైద్య విద్య విద్యార్థులు, డాక్టర్లకు సకల సదుపాయాలు కల్పిస్తాం. నాడు–నేడు ద్వారా ప్రస్తుత మెడికల్‌ కాలేజీల రూపురేఖలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.. అందుకనుగుణంగా నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడా రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top