4 నెలల్లో రూ.1.2 లక్షల ఆదాయం!

Kerala Agricultural University Developed Seedless Watermelon - Sakshi

షోనిమా, స్వర్ణ ‘పుచ్చ’గా నామకరణం

కేరళ అగ్రీ వర్సిటీలో విత్తనాల విక్రయం

ఒక్కో గింజ రూపాయి

కిలోకి 30 వేల గింజలు

∙4 నెలల్లోనే ఎకరానికి రూ.1.2 లక్షల ఆదాయం 

సాక్షి, అమరావతి: రైతు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వినూత్న పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తున్నాయి. మారుతున్న అభిరుచులు, ఆహార అలవాట్లు, అదును తప్పి కురుస్తున్న వర్షాలు, వాతావారణ మార్పులకు అనుగుణంగా కొత్త వంగడాలనూ విశ్వవిద్యాలయాలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగా వచ్చిందే గింజలేని (సీడ్‌లెస్‌) పుచ్చ. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వరిలో అత్యధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేస్తే.. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీడ్‌లెస్‌ పుచ్చ వంగడాలు రెండింటిని రూపొందించింది. వీటికి షోనిమా, స్వర్ణగా నామకరణం చేసి మార్కెట్లో విడుదల చేసింది.

పాలిహౌస్‌లలో పెంపకం..
పుచ్చకాయ ముక్కల్లో నల్లగా ఉండే గింజల్ని తీసేసి తినడం మన అలవాటు. ఎందువల్లనో గాని ఆ గింజల్ని మనం తినం. ఊసేస్తుంటాం. ఇకపై ఆ అవసరం ఉండదు. కొబ్బరి ముక్క మాదిరిగా ఏకంగా గుజ్జునంతటినీ తినొచ్చు. కేరళలోని త్రిచూర్‌ ప్రాంతంలోని వెల్లినక్కర వద్ద కొత్తగా నిర్మించిన పాలిహౌస్‌లో ఆ రాష్ట్ర ఉద్యాన శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సీడ్‌లెస్‌ పుచ్చను సాగుచేసి అబ్బుర పరిచింది. అయితే ఈ పుచ్చరకాన్ని పాలి హౌసులో మల్చింగ్, డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిన పెంచారు. బిందు సేద్యంతో యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేసి సత్ఫలితాలను సాధించిన తర్వాత రైతుల కోసం ప్రదర్శనలో పెట్టారు. ఆ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ టి.ప్రదీప్‌ కుమార్‌ కథనం ప్రకారం ఇదో అసాధారణ హైబ్రీడ్‌ విత్తనం. 

ఎకరానికి రూ.1.2 లక్షల ఆదాయం..
ఈ సీడ్‌లెస్‌ పుచ్చ పంట మంచి లాభసాటి. ఇప్పటి లెక్క ప్రకారం ఎకరానికి రూ.50 వేల ఖర్చు అవుతుంది. ఇది నాలుగు నెలల పంట. ఎకరానికి రూ.1.2 లక్షల వరకు సంపాయించవచ్చునని అంచనా. కేరళ అగ్రి వర్సిటీలోఒక్కో  గింజను రూపాయి చొప్పున అమ్ముతున్నారు. కిలోకి 30వేల గింజలు వస్తాయి. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

రైతుల అనుభవాలు ఇలా..
త్రిచూరు జిల్లాలో పలువురు రైతులు సీడ్‌లెస్‌ పుచ్చను సాగు చేసి లక్షలు గడించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పలు వీడియోలను కూడా రూపొందించి వివిధ వెబ్‌సైట్లలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాల్లో ఈ పంట ఎక్కువగా సాగయ్యే అవకాశాలున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top