ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు

Jagananna Smart Townships in public and private partnership - Sakshi

ప్రాజెక్టుపై రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌కు అవగాహన

మార్గదర్శకాలు, నిబంధనలను వివరించిన సీఆర్డీఏ కమిషనర్‌

ఈ నెల 20 నుంచి భాగస్వామ్య ప్రాజెక్టులకు ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్య ఆదాయ వర్గాలు (ఎంఐజీ) కోరుకునే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను పూర్తి ప్రభుత్వ హామీతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. వాటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల అభివృద్ధి మార్గదర్శకాలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు శనివారం సీఆర్డీఏ కార్యాలయంలో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌తో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ అలీంబాషా, డెవెలప్‌మెంట్‌ ప్రమోషన్‌ డైరెక్టర్‌ ఎం.వెంకటసుబ్బయ్య, క్రెడాయ్‌ అధ్యక్షుడు కె.రాజేంద్ర, సభ్యులు, నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నెరెడ్కో) సభ్యులు, వాటి పరిధిలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిషనర్‌ డెవలపర్స్‌ సందేహాలకు సమాధానం ఇచ్చారు.  ఆయన మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను చేపట్టనున్నామని, ప్రాజెక్టు అమలుకు జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) నేతృత్వం వహిస్తుందని వివరిచారు. 

ప్రాజెక్టుకు 20 ఎకరాలు తప్పనిసరి
డెవలపర్‌ సంస్థ కనీసం 20 ఎకరాల భూమిని లే అవుట్‌గా అభివృద్ధి చేయాలని, యజమాని పేరుతోనే భూమి ఉండాలని కమిషనర్‌ సూచించారు. లే అవుట్‌ అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం వేగంగా అన్ని అనుమతులు ఇస్తుందని వివరించారు. లే అవుట్లను మౌలిక సదుపాయాలతో సహా 150, 200, 240 గజాల విస్తీర్ణంలో మూడు రకాల ప్లాట్లను అభివృద్ధి చేయాలని, డెవలపర్‌ భూమి ఇచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అన్ని అభివృద్ధి పనులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

భూమి యజమానికి, ఎంఐజీల్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ నెల 20 నుంచి ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, డెవలపర్స్‌ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డెవలప్స్‌ అడిగిన సందేహాలను వివేక్‌ యాదవ్‌తో పాటు, ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన డొమైన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సిద్ధార్థ నివృత్తి చేశారు. అలాగే సీఆర్డీఏ ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పాయకాపురం, తెనాలిలోని చెంచుపేట, మంగళగిరి, ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌ ప్రాంతాల్లో ప్లాట్లను ఈ–వేలం ద్వారా అమ్మకానికి ఉంచామని, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ తోడ్పాటునందించాలని కోరారు. 

ఎంఐజీ నిబంధనలు ఇవీ..
► రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 88లోని నిబంధనలకు అనుగుణంగా ఎంఐజీ  లే అవుట్లు ఉండాలి 
► లే అవుట్‌లో పట్టణాభివృద్ధి సంస్థ (యూడిఏ) వాటాగా 40 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఎంఐజీ దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ముందుకొస్తే దాన్ని తిరస్కరణ లేదా అంగీకరించే అధికారం జిల్లాస్థాయి కమిటీకి ఉంటుంది 
► దరఖాస్తుదారులకు అనువైన ప్రాంతంలో ఎలాంటి వ్యాజ్యాలు, తాకట్టులు లేని కనీసం 20 ఎకరాల భూమిలో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి
► ఎంఐజీ ప్లాట్ల అనుమతులు, మార్కెట్‌ విలువ, అమ్మకం ధర వంటి అంశాలు ఎలా ఉండాలో జిల్లా కమిటీ సూచిస్తుంది.
► ప్రాజెక్టు ఏర్పాటు చేసే ఒక ప్రాంతం నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వస్తే మార్గదర్శకాలకు అనుగుణంగా అభివృద్ధి సంస్థలను జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది 
► ఎంఐజీ ప్లాట్ల అమ్మకపు ధర ఎప్పుడూ మార్కెట్‌ ధర కంటే కనీసం 10 నుంచి 20 శాతం తక్కువగా ఉండేలా కమిటీ చూడాలి
► లే అవుట్లలో అంతర్గత రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు, ఫుట్‌పాత్‌ తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి
► ఎంఐజీలో ప్లాట్లు కావాలనుకునేవారు దరఖాస్తుతో పాటు ప్లాట్‌ ధరలో 10 శాతం, ఒప్పదం చేసుకునే సమయంలో మరో 10 శాతం, ప్రాజెక్టు పూర్తయ్యాక ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ సమయంలో మిగిలిన 80 శాతం మొత్తాన్ని చెల్లించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top