అయి‘నోళ్లకు పలారం’
ఆస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్టు నిబంధనలకు చెల్లుచీటి
నోటి మాటపై నిబంధనలు సడలించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన చంద్రబాబు సర్కార్
95 శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఉంటేనే వంద శాతం బిల్లుల మంజూరుకు వీలు
హాజరు తగ్గితే ఆ మేరకు చెల్లింపుల్లో కోత పెట్టాలని రూల్
అయినా సీఎం బంధువు సంస్థ సహా వివిధ సంస్థలకు అడ్డగోలుగా చెల్లింపులు
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోతున్నారు. కల్లబొల్లి మాటలతో పెద్ద మొత్తంలో కమీషన్లు కొల్లగొట్టడమే ధ్యేయంగా ఏకంగా కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టి కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెడుతున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సేవల కోసం కుదర్చుకున్న ఒప్పందాలను అతిక్రమించి అధ్వాన్నమైన సేవలు అందిస్తున్న ఏజెన్సీలకు అక్రమంగా రూ.కోట్ల బిల్లులు చెల్లించేస్తున్నారు.
సెక్యూరిటీ సంస్థలకు నెలకు రూ.8 కోట్లకుపైగా, శానిటేషన్‌కు రూ.14 కోట్లపైనే ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపుల్లో నిబంధనలకు అధికారులు పాతరేశారు. కేవలం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ మౌఖిక ఆదేశాలతో నిబంధనలు సడలించి అక్రమ చెల్లింపులు చేసేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు అద్దం పడుతోంది.
తక్కువ హాజరుకు పూర్తి బిల్లులు
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ సేవల నిర్వహణ కోసం కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. సీఎం బంధువు సంస్థతోపాటు, కీలక నేతకు కోరినంత కమీషన్ ఇచ్చేలా ఎంవోయూ కుదుర్చుకున్న ఏజెన్సీలకే అప్పట్లో కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఏజెన్సీల ఎంపికలోనే కాకుండా, వారికి బిల్లుల చెల్లింపుల్లోను ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని బహిర్గతం అయింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నిబంధనల్లో రెండు రకాల ఏజెన్సీల సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్(ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు 95 శాతం, ఆపైన ఉంటేనే నెలవారీ వంద శాతం చెల్లింపులకు అర్హత ఉంటుంది.
హాజరు శాతం కంటే తక్కువ ఉంటే.. తగ్గిన హాజరు ఆధారంగా చెల్లింపుల్లో కోత పెట్టాలి. ఉదాహరణకు 75 శాతం హాజరు ఉంటే బిల్లులు 75 శాతం మాత్రమే చెల్లించాలి. గతేడాది జూన్‌లో సెక్యూరిటీ, అక్టోబర్‌లో శానిటేషన్ ఏజెన్సీలు సేవలు ప్రారంభించాయి. అన్ని ఏజెన్సీల సిబ్బంది హాజరు ఇప్పటి వరకూ వంద శాతం చెల్లింపులకు అనుగుణంగా 95 శాతం నమోదు కాలేదు. దీంతో తమకు రావాల్సిన బిల్లుల్లో భారీగా కోతలు పడతాయని భావించిన ఏజెన్సీలు ఎఫ్‌ఆర్‌ఎస్ నిబంధన నుంచి సడలించాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ నేపథ్యంలో బిల్లుల్లో భారీ కోతలు పడితే తమకు వచ్చే కమీషన్లలోనూ కోతలు విధిస్తారని నేతలు భావించారో ఏమో కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టేశారు. ఏజెన్సీలకు హాజరు శాతంతో పనిలేకుండా గతేడాది డిసెంబర్ వరకూ చెల్లింపులు చేసేయాలంటూ గతేడాది నవంబర్ 12 డీఎంఈ అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో సౌరభ్‌గౌర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ మీటింగ్ మినిట్స్ ఆధారంగా జూన్ నుంచి నవంబర్ వరకూ సెక్యూరిటీ, శానిటేషన్ సంస్థలకు ప్రభుత్వం చెల్లింపులు కూడా చేసేసింది.
బరితెగింపునకు పరాకాష్ట
వాస్తవానికి సెక్యూరిటీ, శానిటేషన్ సేవలు మ్యాన్‌పవర్‌తో ముడిపడిన అంశం. ఇవేమీ భవన, ఇతర ప్రాజెక్ట్‌ల నిర్మాణం వంటి సేవలు కాదు. మిషనరీ, నిపుణులైన అధికారులు, కారి్మకులను ఇతర ప్రాంతాల నుంచి మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆస్పత్రుల్లో అప్పటి వరకూ పాత ఏజెన్సీలో పనిచేసిన సిబ్బందే మెజారిటీ శాతం కాంట్రాక్ట్ మారిన అనంతరం కొత్త ఏజెన్సీకి మారిపోతారు.
ఈ క్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ కోసం ప్రభుత్వం జీవో ద్వారా ఇచ్చిన పాలసీలో ఎక్కడా కొత్త కాంట్రాక్ట్ సంస్థలకు కొద్ది నెలల పాటు నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. అంటే సదరు సంస్థలు సేవలు ప్రారంభించిన రోజు నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్ ఇతర నిబంధనలు అమలులోకి వస్తాయన్నమాట. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ సంస్థలు కోరుతున్నాయని నోటి మాటపై నిబంధనలు మినహాయింపు ఇవ్వడం కాంట్రాక్ట్ నిబంధనలను వంద శాతం అతిక్రమించడమే అవుతుంది.
సాధారణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన అంశాల్లో మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే తిరిగి ప్రభుత్వం జీవో/అధికారిక సర్క్యులర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్‌లకు ఆర్థికంగా మేలు చేస్తూ మీటింగ్ మినిట్స్ రూపంలో ఆదేశాలు ఇవ్వడం, దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా నిధులు చెల్లింపులు చేయడం ద్వారా భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపింది.
సీఎం బంధువు సంస్థకు 61 శాతం హాజరే
ప్రభుత్వం నిధులను దోచిపెట్టడం కోసం తెచ్చిన సడలింపులతో ఏకంగా 61 శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుతో అట్టడుగు స్థాయిలో ఉన్న సీఎం బంధువు సంస్థ పద్మావతికి భారీ మేలు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ జోన్–3(రాయలసీమ) జిల్లాల్లోని డీఎంఈ ఆస్పత్రుల్లో శానిటేషన్ సేవల్లో ఉంది. గతేడాది నవంబర్ నెలలో 1,800 మంది మేర సిబ్బంది ఎన్‌రోల్ అయినప్పటికీ హాజరు మాత్రం 61 శాతమే నమోదైంది.
ఇంత ఘోరమైన పనితీరు కనబరిచిన పద్మావతి సంస్థకు హాజరు సడలింపు ద్వారా ప్రభుత్వం భారీ మేలు చేసిపెట్టినట్టు వెల్లడవుతోంది. సెక్యూరిటీ, శానిటేషన్ సంస్థల పనితీరుకు ఆస్పత్రుల్లో ఇచ్చే స్కోర్ ఆధారంగా ప్రభుత్వం నవంబర్ వరకూ బిల్లు చెల్లించినట్లు కలరింగ్ ఇస్తున్నారు. దీనికోసం ఏజెన్సీల నిర్వాహకులు సూపరింటెండెంట్స్, ఇతర అధికారులను మేనేజ్ చేసుకుని భారీ స్కోర్ పొందినట్టు తెలుస్తోంది. స్కోర్‌ల జారీ అంశంలో జరిగిన స్కామ్ కూడా ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేతో బట్టబయలైంది.


