‘జీపీఎస్‌’ బాదుడు! | Farmers Facing Huge Problems in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘జీపీఎస్‌’ బాదుడు!

May 6 2026 5:09 AM | Updated on May 6 2026 5:09 AM

Farmers Facing Huge Problems in Chandrababu Govt

ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ రెన్యువల్‌ చార్జీల పేరుతో వడ్డన

రోజుల తరబడి కళ్లాల్లోనే ధాన్యం రాశులు

అయినా కనికరించని సర్కారు అనుభవం లేని మధ్యప్రదేశ్‌ సంస్థకు జీపీఎస్‌ నిర్వహణ బాధ్యతలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయకుండా అన్నదాతలను నడిరోడ్డుపై నిలబెడుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలతో పంట చేజారిపోతుందనే భయంతో రైతన్న బిక్కుబిక్కుమంటున్నా చలించడం లేదు. ధాన్యం తరలించే వాహనాలకు ‘జీపీఎస్‌’ పేరుతో భారం మోపుతోంది. రూ.1400 చొప్పున జీపీఎస్‌ రెన్యువల్‌ చార్జీలు చెల్లిస్తే తప్ప ధాన్యం కొనుగోలు చేయమంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అధికారులకు టార్గెట్లు పెట్టిమరీ జీపీఎస్‌ రెన్యువల్‌ చార్జీలు వసూలు చేయాలని హుకుం జారీ చేయడం అన్నదాతను కలవరపరుస్తోంది.

లక్ష్యాలే.. సేకరణ ఎప్పుడు?
రబీలో రైతుల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికి వచ్చి మూడు వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం మిల్లులకు తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి చేయడంతో మరిన్ని అవస్థలు తప్పడం లేదు. గతానికి భిన్నంగా రబీ సీజన్‌లో జీపీఎస్‌ రెన్యువల్‌ పేరుతో రూ.1400 చెల్లించాలని ఒత్తిడి చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నా సర్కారు చలించడం లేదు.

ఇప్పుడు ఒకవేళ వాహనదారులు రూ.1400 చెల్లించినా ఈ రబీ సీజన్‌కు మాత్రమే వర్తిస్తే... వచ్చే ఖరీఫ్‌లో మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉండటంతో ఇప్పుడెందుకు కట్టాలనే ప్రశ్న ఎదురవుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం రెన్యువల్‌ చార్జీలు చెల్లిస్తే ధాన్యం తరలిస్తామంటూ మెలికపెట్టడంతో క్షేత్ర స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ గాడితప్పింది. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జీపీఎస్‌ సొమ్ముచెల్లించాలనే నిబంధనను మినహాయించి ధాన్యం సేకరించాలని రైతులు కోరుతున్నారు.
అనుభవం లేని మధ్యప్రదేశ్‌ సంస్థకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ బాధ్యతలు!

గతేడాది పౌరసరఫరాల సంస్థ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీకి స్టేజ్‌ –1,2 జీపీఎస్‌ ట్రాకింగ్‌ టెండర్‌ ఇచ్చారు. సదరు సంస్థ జీపీఎస్‌ ట్రాకింగ్‌ డేటా నిర్వహణలో అనుభవం లేక చేతులు ఎత్తేసింది. అయినా టెండర్‌ నిబంధనలు పాటించకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ మొత్తం జీపీఎస్‌ నిర్వహణ బాధ్యతను అదే సంస్థకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పౌరసరఫరాల సంస్థలోని సాంకేతిక విభాగం చూసే ఓ అధికారి చక్రం తిప్పారు. ఆమె స్వయంగా కొందరు ఉద్యోగులను మధ్యప్రదేశ్‌ సంస్థలో నియమించి ఎలాగోలా నెట్టుకొచ్చారు. పైగా తన బినామీ సంస్థతో కొత్త జీపీఎస్‌ మిషన్లు రైతులతో బలవంతంగా కొనిపించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement