నీట మునిగి 8 మంది దుర్మరణం 

Eight youths drowned and deceased in four separate incidents - Sakshi

నాలుగు చోట్ల ప్రమాదాలు

సముద్రంలో ఐదుగురు, నదిలో ముగ్గురు మృత్యువాత  

మరో ఐదుగురు గల్లంతు 

శ్రీకాకుళం, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఘటనలు

కవిటి/కొత్తపట్నం/పెనమలూరు: నాలుగు వేర్వేరు ఘటనల్లో 8 మంది యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగి ఐదుగురు మృతిచెందగా, కృష్ణా నదిలో మునిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.  

ముగ్గురిని మింగేసిన సుడిగుండం..  
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన బొర్ర సాయిలోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా 15 మంది స్నేహితులు పుక్కళ్లపాలెం తీరం వద్ద సముద్ర స్నానానికి వెళ్లారు. అంతలో ఉవ్వెత్తున వచ్చిన కెరటం తాకిడిని తట్టుకోలేక నలుగురు యువకులు అక్కడే ఉన్న సుడిగుండంలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎవ్వరూ సాహసించలేకపోవడంతో మారిడి తిరుమల(21), బొర్ర మనోజ్‌(24), బొర్ర సాయిలోకేష్‌(20)లు ప్రాణాలు విడిచారు. కాసేపటికి వారి మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. బొర్ర గోపీచంద్‌ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు.  

ఇద్దరి ఉసురు తీసిన అల  
ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాల్‌నగరానికి చెందిన ఈర్ల సుజిత్‌(21), టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలేనికి చెందిన శనగపల్లి శ్రీనివాస్‌(21), పేర్నమిట్టకు చెందిన ఆకుల అనుదీప్, ఒంగోలుకు చెందిన షేక్‌ ఆలీష్‌లు పదో తరగతి చదివేప్పుడు స్నేహితులు. ప్రస్తుతం వివిధ కాలేజీల్లో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఈ నలుగురూ కలిసి కొత్తపట్నం బీచ్‌కు వెళ్లారు. సముద్రంలోకి దిగి ఈర్ల సుజీత్, శనగపల్లి శ్రీనివాస్‌లు కొద్దిగా ముందుకెళ్లారు. ఒక్కసారిగా అల రావడంతో ఇద్దరూ లోనికి కొట్టుకుపోయారు. ఒడ్డునే ఉన్న అనుదీప్, ఆలీష్‌లు పెద్దగా కేకలు వేశారు. మత్స్యకారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుజీత్, శ్రీనివాస్‌లు శవాలై ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

ఊపిరి తీసిన ఊబి  
కృష్ణా జిల్లా తాడిగడప కార్మికనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ పోతార్లంక జయసాయిశ్రీనివాస్‌(25), గురునానక్‌ కాలనీకి చెందిన కె.గోవిందు(22) రామవరప్పాడు బల్లెంవారి వీధికి చెందిన కార్పెంటర్‌ కె.సతీష్‌(21), పటమట ఆటోనగర్‌కు చెందిన పొలగాని శివ(20)లు చేపలు పట్టేందుకు పెదపులిపాక ఘాట్‌ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. జయసాయిశ్రీనివాస్, గోవిందు, సతీష్‌ నదిలోకి దిగగా, శివ ఒడ్డున కూర్చున్నాడు. నదిలోకి దిగిన కొద్ది సమయానికే ఊబిలో పడి ముగ్గురూ మునిగిపోయారు. ఫైర్‌ సిబ్బంది సాయంతో మూడు మృతదేహాలనూ వెలికి తీసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయా ఘటనల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరిలో నలుగురు గల్లంతు 
పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరం సమీపాన ఆదివారం గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్‌ (15), యర్రంశెట్టి రత్నసాగర్‌ (15), పంతాల పవన్‌ (15), ఖండవిల్లి వినయ్‌ (15) గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top