
ఏలూరు బీడీ కాలనీలో సిర్రి నూకరాజుకు దివ్యాంగ పింఛన్ అందిస్తున్న వలంటీర్ వి.లిల్లీ శాంతి
సాక్షి, అమరావతి: ఠంచన్‌గా ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలైంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వలంటీర్లే వెళ్లి డబ్బులు అందజేశారు. మంగళవారం ఒక్క రోజునే 55,23,610 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.1,404.03 కోట్లు పంపిణీ చేశారు.
ఈ నెలకు గాను 62,33,382 మంది పింఛన్‌దారులకు పంపిణీ చేసేందుకు రూ.1,585.60 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఒక్క రోజు ముందే ఆయా గ్రామ వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.
మంగళవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పంపిణీ ప్రారంభించి తొలి రోజు 88.55 శాతం మందికి పంపిణీ పూర్తి చేసినట్లు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. వలంటీర్ల ఆధ్వర్యంలో ఐదవ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.