జేఎల్‌ఎం గ్రేడ్–2 ఉద్యోగులకు ఖాళీగా ఉన్న జేఎల్‌ఎం పోస్టుల పరిమితిలోనే పదోన్నతి కల్పించాలంటూ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్ ఇచ్చిన ఆదేశాలు
జూనియర్ లైన్‌మెన్‌గా పదోన్నతిపై నీళ్లు
హైకోర్టు తీర్పుతో మొదలైన ప్రక్రియలో షరతు
ప్రస్తుతం ఉన్న ఖాళీల వరకే పదోన్నతితో భర్తీ
ఫలితంగా కొందరికే జేఎల్‌ఎంలుగా అవకాశం
మిగతా గ్రేడ్–2 జేఎల్‌ఎంల భవిష్యత్తు ప్రశ్నార్థకం
సాక్షి, అమరావతి: పదోన్నతులు వస్తున్నాయన్న సంతోషం గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్లకు మూడురోజులు కూడా మిగల్లేదు. అందరికీ పదోన్నతులు వస్తాయని ఆనందిస్తున్న వారు.. కొందరికే పదోన్నతులుంటాయని తెలియడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఒకేసారి ఉద్యోగంలో చేరి, అందరూ ఒకేసారి పదోన్నతికి అర్హత సాధించి, ఐదేళ్లు పూర్తిచేసుకున్నప్పటికీ పదోన్నతుల వద్దకు వచ్చేసరికి నామమాత్రంగా కొందరికే ఇస్తున్న చంద్రబాబు సర్కారు ఎక్కువమందికి వెన్నుపోటు పొడుస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికే ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వేలు, డేటా సేకరణ వంటి ఇతర పనుల కోసం వినియోగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ సేవల్లో అంతరాయం కలిగి ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను ఇకపై విద్యుత్ శాఖకు సంబంధించిన పనులకే పరిమితం చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం గత నెల 28న ఆదేశించింది. అది నిజమనుకుని ఎనర్జీ అసిస్టెంట్లు సంతోíÙంచారు. కానీ ఇదంతా నాటకమని తేలిపోయింది. ఎనర్జీ అసిస్టెంట్లకు చంద్రబాబు సర్కారు యథావిధిగా వెన్నుపోటు పొడిచింది.
వైఎస్సార్‌సీపీ పాలనలో 7 వేలమంది నియామకం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి 7 వేలమందిని శాశ్వత ఉద్యోగులుగా చేసి విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో విధులు కేటాయించారు. జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2గా పిలుస్తున్న వీరిలో కనీసం ఐదేళ్లు నిరంతరసేవ పూర్తిచేసిన వారికి జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం)గా పదోన్నతి కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి గత ఏడాది అక్టోబర్ 24న మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం డిసెంబర్ 10న ఉత్తర్వులు కూడా జారీచేసింది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్‌పడింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు గత నెల 8వ తేదీ కొట్టేయడంతో.. ఎనర్జీ అసిస్టెంట్లకు పదోన్నతుల ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) చర్యలు చేపట్టింది. దీంతో తమకు పదోన్నతి వస్తుందని, ఇప్పుడున్న వేతనం రూ.22,460 కాస్తా రూ.30,800కు పెరుగుతుందని ఎనర్జీ అసిస్టెంట్లు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు.
ఖాళీల వరకే పదోన్నతులు
అర్హత గల జేఎల్‌ఎం గ్రేడ్–2 ఉద్యోగులకు ఖాళీగా ఉన్న జేఎల్‌ఎం పోస్టుల పరిమితిలోనే మూడురోజుల్లోగా పదోన్నతి కల్పించాలంటూ డిస్కంల సీఎండీలు ఆపరేషన్ సర్కిళ్లలోని సూపరింటెండింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు జారీ చేసిన ఆదేశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అంటే ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న జేఎల్‌ఎం పోస్టులనే ఎనర్జీ అసిస్టెంట్లకు పదోన్నతితో భర్తీచేస్తారు. అంటే మొత్తం ఏడువేల మందికి పదోన్నతులు రావు. ప్రభుత్వానికి నివేదిస్తామని, ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేస్తే వాటిలో మిగిలినవారిని భర్తీచేస్తామని విద్యుత్ సంస్థలు చెబుతున్నా.. అది ఎప్పటికవుతుందో తెలియదు. అప్పటివరకు మిగిలినవారి పదోన్నతుల అంశం గాలిలో ఉన్నట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


