మరో సీజన్‌ ముగిసినా అందని మోంథా పరిహారం | Cyclone Montha Crop Damage Compensation not yet been received in andhra pradesh | Sakshi
Sakshi News home page

మరో సీజన్‌ ముగిసినా అందని మోంథా పరిహారం

May 9 2026 5:01 AM | Updated on May 9 2026 5:03 AM

Cyclone Montha Crop Damage Compensation not yet been received in andhra pradesh

పడిపోయిన వరి చేనును చూపిస్తున్న రైతులు (ఫైల్‌)

గతేడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన మోంథా తుపాను  

అడ్డగోలుగా కోతలు వేసి తుది అంచనాలు కుదించిన ప్రభుత్వం  

15 లక్షల ఎకరాల్లో పంట నష్టమైతే.. 4.27 లక్షల ఎకరాలకే పరిమితం  

తొలుత పంటనష్టం రూ.869 కోట్లని.. చివరికి రూ.390 కోట్లకు కుదింపు  

ఆరునెలలు గడిచినా అందని పంట నష్టపరిహారం.. 3.23 లక్షల మంది ఎదురుచూపులు

సాక్షి, అమరావతి: ఆరు నెలల కిందట మోంథా తుపాను అన్నదాత ఆశలను చిదిమేసింది. ఆరుగాలం కష్టపడి, కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికొచ్చే సమయంలో పగబట్టినట్టు విరుచుకుపడిన తుపాన్‌ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. ప్రకృతి విపత్తుతో కుదేలైన రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరునెలలు గడి­చినా పైసా పరిహారం అందకపోవడంతో బాధిత రైతులు విల­విల్లాడిపోతున్నారు. గతేడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన మోంథా తుపా­ను దెబ్బకు అన్నదాతలు కకావికలమయ్యారు. తుపాను త­రు­వాత ఎటుచూసినా బురదమయమైన పొలాలు, నేలకొరిగిన పైరే కనిపించాయి.

వరితో మొదలు జొన్న వరకు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. రైతుల ఆశలు నేలరాలిపోగా అప్పు­ల కుప్పలు మిగిలాయి. తుపాను చేసిన గాయం కంటే చంద్ర­బాబు సర్కార్‌ చేసిన మోసానికి అన్నదాతలు గుండెలవిసేలా విలపిస్తున్నారు. మోంథా తర్వాత దిత్వా తుపాను కూడా దెబ్బతీసింది. కానీ మోంథా తుపాను సాయం మాత్రం రైతుల చేతికందలేదు. మోంథా తుపాను 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకు­పైగా పంటలపై ప్రభావం చూపిందని తొలుత ప్రభుత్వమే ప్రకటించింది. 4.40 లక్షల ఎకరాల్లో ప్రాథమిక నష్టం జరిగిందని ప్రకటించిన అధికార యంత్రాంగం.. తరువాత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి 3.45 లక్షల ఎకరాల్లోనే నష్ట­మని చెప్పింది. 

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను ఓదార్చారు. ఇలాంటి విపత్కర సమయాల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పంటనష్టం అంచనాలను ఎలా తగ్గించి చూపిస్తుందంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 

తొలుత పంటనష్టం రూ.869 కోట్లని చెప్పి... 
రైతుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో చివరకు 4.27 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టుగా లెక్కతేల్చారు. తొలుత ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.869 కోట్ల వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) చెల్లించాల్సి ఉంటుందంటూ కేంద్రానికి నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం తుది నివేదికలో ఇన్‌పుట్‌ సబ్సిడీని సగానికి పైగా కోసేసింది. చివరికి వచ్చేసరికి 3.23 లక్షల మంది రైతులకు రూ.390.03 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తే సరిపోతుందని తేల్చింది. పంట నష్టపరిహారం క్షణాల్లో చేతుల్లో పెట్టేస్తామన్నట్టుగా తుపాను వేళ నానా హంగామా చేసిన ప్రభుత్వం.. పంటనష్టం తుది అంచనాలకు 24 గంటల గడువునిచ్చి పారదర్శకతకు పాతరేసింది. అధికారులు కనీసం క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా టీడీపీ నేతల సిఫార్సులు, కనుసన్నల్లోనే గాలిలెక్కలతో తుది జాబితాలను రూపొందించారు. ఆర్బీకేల్లో ఆ జాబితాల ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాన్ని మొక్కుబడి తంతుగా మార్చేశారు.

అడ్డగోలు కోతలఅనంతరం తయారుచేసిన తుది అంచనాల మేరకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అన్నదాత సుఖీభవ రెండోవిడత సాయంతో కలిపి జమచేస్తామని ప్రకటించారు. పంట నష్టపరిహారం చేతికొస్తే కనీసం రబీలో పెట్టుబడికి కాస్త అక్కరకొస్తుందని రైతులంతా ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. చివరికి అప్పులతోనే సాగుచేసిన రబీ సీజన్‌ కూడా దాదాపు చివరిదశకు చేరుకుంది. పీఎం కిసాన్‌తో కలిపి గతనెలలో మూడోవిడత పెట్టుబడి సాయంతో మమా అనిపించారు. అయినా మోంథా పరిహారం ఊసెత్తలేదు. గత 23 నెలల్లో దాదాపు 16 విపత్తులు విరుచుకుపడ్డాయి. కరువు సాయం బకాయిలు కలిపి రూ.1,100 కోట్లకు పైగా రైతులకు జమ చేయాల్సి ఉంది. రెండు వ్యవసాయ సీజన్లు ముగిసినా పరిహారం ఎప్పుడు చెల్లిస్తామన్నది కూడా చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.  

నాడు సీజన్‌ ముగిసేలోగానే పరిహారం  
విపత్తుల వేళ దెబ్బతిన్న రైతులకు వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచేది. వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా రూ.2 వేలకోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు ఆర్బీకే సిబ్బంది ద్వారా ఈ–క్రాప్‌ ప్రామాణికంగా అర్హులను గుర్తించేవారు. అర్హుల జాబితాలను సోషల్‌ ఆడిట్‌లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించేవారు. ఈ జాబితాల్లో తమ పేర్లు లేవని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే పునఃపరిశీలించి వారి పేర్లను జాబితాలో చేర్చేవారు.

వారి మొబైల్‌ ఫోన్లకు నేరుగా మెసేజ్‌లు కూడా పంపేవారు. పైగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే పరిహారాన్ని అదే సీజన్‌ ముగిసేలోగా అణా పైసలతో సహా లెక్కగట్టి మరీ నేరుగా రైతుల ఖాతాలో జమచేశారు. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షలమంది రైతులకు రూ.3,261.60 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారు. పైసా భారం పడకుండా అమలుచేసిన ఉచిత పంటల బీమా ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షలమంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందజేసి అండగా నిలిచారు.  

ఈయన పేరు వి.వెంకటేశ్వరరెడ్డి. గుంటూరు జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో వరి, రబీలో జొన్న పంట సాగు చేశారు. గతేడాది అక్టోబర్‌లో విరుచుకుపడిన మోంథా తుపాను దెబ్బకు మూడొంతుల వరిపంట పోయింది. ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోయారు. అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఆరునెలలు గడిచినా పైసా పరిహారం రాలేదు.  రైతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement