కడపలో ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు
సీఐ, ఎస్‌ఐ, మరో ఇద్దరు పోలీసులకు గాయాలు
పోలీసుల లాఠీచార్జితో చెదిరిన ఇరువర్గాలు
సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరం అల్మాస్‌పేటలో ఓ ఘటన ఇరువర్గాల మధ్య చిచ్చు రేపింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడులకు దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నంలో సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, మరో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యా హ్నం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్మాస్‌పేట సర్కిల్‌లో ఓ వర్గం బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. బ్యానర్ల ఏర్పాటుపై అభ్యంతరం చెబుతూ మరోవర్గం నిరసనకు దిగింది. ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.
దీంతో ఇరువర్గాలూ బ్యానర్లు తీసేసి, శాంతియుత వాతా వరణం కల్పించేందుకు సహకరించాలని పోలీసు లు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా ఇరువర్గాలు రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో పోలీసులూ గాయాలపాలవడంతో ఇరు వర్గాలపై లాఠీ ఝుళిపించారు. అల్లరి మూకలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పరస్పర కవ్వింపు చర్యలకు పాల్పడడంతోనే ఘర్షణ ఉత్ప న్నమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


