కేకే లైన్‌ పాయే | Chandrababu Naidu Govt Neglected KK Line Labor unions are on fire | Sakshi
Sakshi News home page

కేకే లైన్‌ పాయే

May 6 2026 5:20 AM | Updated on May 6 2026 5:20 AM

Chandrababu Naidu Govt Neglected KK Line Labor unions are on fire

వాల్తేర్‌ డివిజన్‌ రద్దు... విశాఖ, రాయగడ రైల్వే డివిజన్ల ఏర్పాటు

అధిక ఆదాయం వచ్చే కేకే లైన్‌ ఒడిశాకే..

కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా నోరుమెదపని చంద్రబాబు  

సీఎం మౌనం వల్లే కేకే లైన్‌ కోల్పోయామంటూ మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు 

జూన్‌1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం 

గెజిట్‌ విడుదల చేసిన రైల్వే శాఖ

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి గాలికొదిలేసింది. వాల్తేర్‌ డివిజన్‌లో అత్యంత కీలకమైన కొత్తవలస– కిరండూల్‌ రైల్వే లైన్‌ (కేకే లైన్‌)ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌లో కొనసాగించేలా చూడటంలో ఘోరంగా విఫలమైంది. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ఎంపీలు పట్టించుకోకపోవడంతో వాల్తేర్‌ రైల్వే డివిజన్‌లో అత్యధిక ఆదాయం వచ్చే ముఖ్యమైన లైన్లన్నీ ఒడిశాకు వెళ్లిపోయాయి. కేకే లైన్‌ ద్వారా ఏడాదికి సగటున రూ.3 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, ఈ లైన్‌ను కొత్తగా ఏర్పాటు చేసే విశాఖపట్నం రైల్వే డివిజన్‌ పరిధిలో కొనసాగించేలా చూడాలని ఉత్తరాంధ్ర ప్రజలు, రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు చాలాకాలం నుంచి కోరుతున్నారు. 

ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజారాణి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రాలు అందించారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే కేకే లైన్‌ను కోల్పోవాల్సి వచ్చిందని రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాల్తేర్‌ డివిజన్‌లో కీలకమైన కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చడం వల్ల విశాఖపట్నం డివిజన్‌కు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని, ఆ ప్రభావం విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. కేకే లైన్‌ను రాయగడ డివిజన్‌లో కలుపుతున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ అందులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  

జూన్‌ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు 
జూన్‌ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 3(4) కింద సోమవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్, భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని కొన్ని ప్రాంతాలను విభజించి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఇక నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోకి వస్తాయి. భువనేశ్వర్‌ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలోని వాల్తేర్‌ డివిజన్‌ను రద్దు చేశారు. దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్, ఒడిశాలోని రాయగడ కేంద్రంగా మరో డివిజన్‌ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం డివిజన్‌ను దక్షిణ కోస్తా జోన్‌లో, రాయగడ డివిజన్‌ను తూర్పు కోస్తా జోన్‌లో చేర్చారు. ఇనుప ఖనిజం రవాణా ద్వారా ఆదాయం వచ్చే కేకే లైన్‌ను రాయగడకు కేటాయించి, కేవలం ప్రయాణికుల రద్దీ ఉండే లైన్లను మాత్రమే విశాఖపట్నం డివిజన్‌లో ఉంచారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయింపు 
విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి రైల్వే జోన్‌ సాధన కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రైల్వే జోన్‌ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రైల్వేశాఖ రూపొందించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ముడసర్లోవలో భూమి కేటాయించింది. ఆ భూమిలోనే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌ ఇటీవల ప్రకటించారు. 

విశాఖపట్నం డివిజన్‌ ఇలా..  
విశాఖపట్నం డివిజన్‌ మొత్తం 463 రూట్‌ కిలో మీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందులో ఇచ్ఛాపురం–విశాఖపట్నం–దువ్వాడ మార్గం (270 కి.మీ.), విజయనగరం–కూనేరు మార్గం (102 కి.మీ.), నౌపడ జంక్షన్‌–పర్లాఖేముండి సెక్షన్‌ (39 కి.మీ.), బొబ్బిలి జంక్షన్‌–సాలూరు సెక్షన్‌ (17 కి.మీ.), సింహాచలం నార్త్‌–దువ్వాడ బైపాస్‌ వంటి పర«దీయ మార్గాలు (35 కి.మీ.) ఉన్నాయి. 

రాయగడ డివిజన్‌ ఇలా... 
రాయగడ డివిజన్‌ మొత్తం 696 రూట్‌ కిలో మీటర్లలో ఉంటుంది. కోరాపుట్‌–సింగపూర్‌ రోడ్‌(164 కి.మీ.), కొత్తవలస–కిరండూల్‌ కేకే లైన్‌(442 కి.మీ.) కూనేరు–థేరువాలి (36 కి.మీ.), గుణుపూర్‌–పర్లాఖేముండి (54 కి.మీ.) సెక్షన్లు ఈ డివిజన్‌లో ఉంటాయి.  

దక్షిణ మధ్య రైల్వేలో మార్పులు 
దక్షిణ మధ్య రైల్వే జోన్‌ (సికింద్రాబాద్‌) పరిధిలో హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్‌లు యథావిధిగా కొనసాగుతాయి. వీటికి అదనంగా పరిపాలన అవసరాల దృష్ట్యా గుంతకల్‌ డివిజన్‌ నుంచి రాయచూర్‌–వాడి సెక్షన్‌ (108 కి.మీ.)ను సికింద్రాబాద్‌ డివిజన్‌కు బదిలీ చేస్తారు. గుంటూరు డివిజన్‌ నుంచి విష్ణుపురం–పాగిడిపల్లి–జాన్‌పహాడ్‌ సెక్షన్‌ (142 కి.మీ.) కూడా సికింద్రాబాద్‌ డివిజన్‌కు బదిలీ అవుతుంది. సికింద్రాబాద్‌ నుంచి కొండపల్లి–మోటుమర్రి సెక్షన్‌ (46 కి.మీ.) మాత్రం విజయవాడ డివిజన్‌కు బదిలీ చేస్తారు. కాగా, తూర్పు కోస్తా రైల్వే (భువనేశ్వర్‌) పరిధిలో సంబల్‌పూర్‌ డివిజన్, పునర్వ్యవస్థీకృత ఖుర్దా రోడ్‌ డివిజన్, కొత్తగా ఏర్పడే రాయగడ డివిజన్‌ కొనసాగుతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement