స్థానిక సంస్థల సొమ్ముతో సర్కారు షో | Chandrababu Government Failed to Release Rs 1026 Crores in Finance Commission Funds to Local Bodies | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల సొమ్ముతో సర్కారు షో

May 9 2026 5:42 AM | Updated on May 9 2026 5:42 AM

Chandrababu Government Failed to Release Rs 1026 Crores in Finance Commission Funds to Local Bodies

ఆర్థిక సంఘం నిధులు రూ.1,026 కోట్లు స్థానిక సంస్థలకు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం  

కేంద్రం ఇచ్చిన పది రోజుల్లో స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలని నిబంధన  

మూడున్నర నెలలుగా ఈ నిధులను ఇతర అవసరాలకు వాడుకుంటున్న రాష్ట్ర సర్కారు  

గత ఏడాది 8 నెలల తర్వాత స్థానిక సంస్థలకు ఇచ్చిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,026 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుంటోంది. నిధులు వచ్చి మూడున్నర నెలలైనా స్థానిక సంస్థలకు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత గరిష్టంగా పది పనిరోజుల్లో ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం జనవరి 29న రూ.410 కోట్లు, ఫిబ్రవరిలో మరో రూ.616 కోట్లు విడుదల చేసింది.

ఈ నిధులను 70 శాతం గ్రామ పంచాయతీలకు, 20 శాతం మండల పరిషత్‌లకు, పది శాతం జిల్లా పరిషత్‌లకు ఇవ్వాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి కూడా మార్చి నెలాఖరుతో ముగిసింది. ఏప్రిల్‌ 2వ తేదీతో గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారుల పాలన మొదలైంది. అయినప్పటికీ ఆ నిధులు నేటికీ స్థానిక సంస్థలకు ఇవ్వలేదు. 

రెండేళ్లుగా ఇదే తీరు..  
⇒  చంద్రబాబు ప్రభుత్వం ఇంతకు ముందు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కూడా నెలల తరబడి స్థానిక సంస్థలకు జమ చేయలేదు. 2025–26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.1,026 కోట్లను గత అక్టోబర్‌లో కేంద్రం విడుదల చేసింది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర నెలల అనంతరం ఈ ఏడాది జనవరి 18న స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.  
⇒  2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను కేంద్రం 2024 సెపె్టంబర్‌లో విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు నెలల తర్వాత నవంబర్‌లో ఆ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.  

⇒  2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులు రూ.1,121 కోట్లను 2024 డిసెంబర్‌లో కేంద్రం విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల తర్వాత 2025 సెపె్టంబర్‌లో స్థానిక సంస్థలకు ఇచ్చింది.  
⇒  2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడత నిధులు రూ.998 కోట్లను కేంద్రం 2024 మార్చి నెలాఖరులో విడుదల చేసింది. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆ నిధులను స్థానిక సంస్థలకు జమ చేయలేదు. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్‌ 12వ తేదీనే బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ సంవత్సరం ఆగస్టు వరకు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement