సీఐడీని ప్రత్యక్షంగా పర్యవేక్షించేది చంద్రబాబే
అందువల్ల సీఐడీ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు
కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలి
సీఐడీని ప్రభావితం చేస్తున్నందున ఆయన బెయిల్‌ను రద్దు చేయాలి
ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదలాయించాలి
హైకోర్టుకు నివేదించిన న్యాయవాది శ్రవణ్ కుమార్
‘ఆళ్ల’ పిటిషన్లపై ముగిసిన వాదనలు
తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై వాదనలు ముగిశాయి.
అలాగే ఈ కేసులో చంద్రబాబుకు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణార్హతతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును ఏసీబీ కోర్టు నుంచి విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ విచారణార్హతపై కూడా వాదనలు ముగిశాయి. ఈ మూడు వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆధారాలు ఉన్నాయన్న అదే సీఐడీ.. ఇప్పుడు లేవంటోంది
అంతకు ముందు ఆళ్ల తరఫున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ చేసిన వాదనల్లో ముఖ్యాంశాలు..
» ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నారు.
» ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ప్రస్తుతం సీఐడీ పనిచేస్తోంది.
» ఈ నేపథ్యంలో సీఐడీ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు.
» గతంలో ఆళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ ఆ తరువాత ప్రాథమిక విచారణ జరిపి పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించి, చార్జిషీట్ దాఖలు చేసింది.
» అయితే ప్రభుత్వం మారిన వెంటనే సీఐడీ గతానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఏకంగా కేసును మూసివేసేందుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
» ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన కింద పనిచేసే సీఐడీని ప్రభావితం చేస్తున్నారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి.
» ఇక చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పలు షరతులు విధించింది. దర్యాప్తును ప్రభావితం చేయరాదన్నది కూడా ఓ షరతు. చంద్రబాబు ఆ షరతును ఉల్లంఘించారు. అందుకే ఆయన బెయిల్‌ను రద్దు చేయాలి.
» అంతేకాక ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టే వినాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పింది. చార్జిషీట్ దాఖలు చేయడం పూర్తయిన నేపథ్యంలో ట్రయల్ నిర్వహించే నిమిత్తం ఏసీబీ కోర్టు ఈ కేసును ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
» కాగా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. రాజకీయ కారణాలతో ఆళ్ల ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని తెలిపారు.


