గిరిజన గర్భిణులకు కొండంత రక్షణ

AP Govt Protection for tribal pregnant women with Pregnant Friendly - Sakshi

‘కొలాబరేటివ్‌ మానిటరింగ్‌ సిస్టం యాప్‌’

గర్భిణుల ఆరోగ్యాన్ని 30 రోజుల ముందు నుంచే పర్యవేక్షించేందుకు 

ఆన్‌లైన్‌ విధానం.. రేపు పాడేరులో ట్రయల్‌ రన్‌

గురుకుల విద్యార్థుల ఆరోగ్య వివరాలు సైతం యాప్‌లోనే

సాక్షి,అమరావతి: మన్యంలోని గర్భిణులకు కొండంత రక్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రెగ్నెంట్‌ ఫ్రెండ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత సమన్వయంతో సమర్థవంతమెన ఆరోగ్య సేవలు అందించేలా ‘ట్రైబల్‌ హెల్త్‌ కొలాబరేటివ్‌ మానిటరింగ్‌ సిస్టం’ (గిరిజన ఆరోగ్య సమన్వయ పర్యవేక్షణ విధానం) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దీనిని నిర్వహించనుంది. గిరిజన గర్భిణులకు కొత్తగా అందించనున్న సేవలతోపాటు కొత్త యాప్‌ను కూడా సోమవారం ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించే ట్రయల్‌ రన్‌ను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తారు. 

యాప్‌తో ప్రయోజనాలు ఇలా
ఏజెన్సీ ప్రాంత గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక యాప్‌తో ప్రయోజనం మెండుగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల ఆరోగ్య సమాచారం సేకరించి ఈ యాప్‌లో పొందుపరుస్తారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించేలా ఈ యాప్‌ ఎప్పటికప్పుడు అధికారులను, సంబంధిత విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార సేకరణ నుంచి వైద్య సేవలు అందించే వరకు గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. యాప్‌లో పొందుపరిచిన సమాచారం మేరకు ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై ఆయా కుటుంబాల వారికి ఆశ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు అవగాహన కల్పిస్తారు. 20 రోజుల ముందు వారిని ఏ ఆస్పత్రికి తరలించేది గ్రామ సచివాలయాలకు సమాచారం అందిస్తారు. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి సమాచారం అందిస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీవోలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. 

ప్రసూతి వసతి గృహాలకు తరలింపు
ఈ యాప్‌ ద్వారా ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు గర్భిణులకు అవగాహన, వారి బంధువులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ప్రసవానికి 30 నుంచి 10 రోజుల సమయం ఉండగానే ప్రసూతి వసతి గృహాలకు తరలిస్తారు. ఇందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 41 ప్రసూతి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో 2,600 బెడ్‌లు సమకూర్చారు. ప్రసవానికి ముందు నుంచి గర్భిణులు ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేలా ఆట పాటలతో కూడిన వాతావరణ కల్పిస్తారు. అంతేకాకుండా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తరగతులు నిర్వహించడంతోపాటు బలమైన ఆహారం అందిస్తారు.

తల్లీబిడ్డల మరణాలు తగ్గించడమే లక్ష్యం
గిరిజన ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డోలీతో మోసుకొచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ బైక్‌ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్‌లో గర్భిణుల వివరాలతోపాటు గురుకుల విద్యార్థుల వివరాలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి అందించాల్సిన వైద్య సేవలు వంటి ఎన్నో వివరాలు ఉంటాయి.
– పుష్ప శ్రీవాణి, ఉప  ముఖ్యమంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top