హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP government Special Attention To High Risk Pregnant Women - Sakshi

మాతా, శిశు మరణాల కట్టడికి సర్కారు ప్రణాళిక     

ప్రసవానికి ముందే ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలింపు

రవాణా చార్జీలు భరించనున్న ప్రభుత్వం

ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్‌ రూపకల్పన

రాష్ట్రంలో సగటున నెలకు 5 వేల హైరిస్క్‌ గర్భిణుల ప్రసవాలు 

సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రసవం సమయంలో మాతా, శిశు మరణాలకు హైరిస్క్‌ ప్రెగ్నెన్సీయే ప్రధాన కారణమవుతోంది. ఈ క్రమంలో మాతా, శిశు మరణాల కట్టడికి ఇప్పటికే వివిధ చర్య­లు చేపడుతున్న సీఎం జగన్‌ ప్రభు­త్వం మరో కీలక ప్రక్రియకు శ్రీకారం చుడు­తోంది.

హైరిస్క్‌ గర్భి­ణులను ప్రస­వానికి మూడు, నాలుగు రోజుల ముందే ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించడం ద్వారా వారికి మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించాలని నిర్ణయించింది. హైరిస్క్‌ గర్భిణులను పెద్దాస్ప­త్రు­లకు తరలింపునకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఇప్పటికే పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులకు ప్రభుత్వం 108 అంబులెన్స్‌ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తూ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. 2020 నుంచి ఇప్పటివరకూ 108 అంబులెన్స్‌లు 10 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు హాజరవగా.. ఇందులో అత్యధికంగా 19 శాతం మంది గర్భిణులు ఉండటం గమనార్హం.

ఏటా రూ.12 కోట్ల వరకు..
హైరిస్క్‌ గర్భిణులను ప్రసవానికి ముందే పెద్దాస్పత్రులకు తరలించడం కోసం నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని వైద్య శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా 8  లక్షల మందికిపైగా గర్భిణులు ఆర్సీహెచ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అవుతుంటారు. కాగా, వీరిలో 10 శాతం మంది హైరిస్క్‌లో ఉంటున్నారు. ఈ లెక్కన నెలకు 5 వేల వరకూ హైరిస్క్‌ గర్భిణుల ప్రసవాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అన్ని పీహెచ్‌సీలకు రాబోయే వారం రోజుల్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న హైరిస్క్‌ గర్భిణుల సమాచారం రాష్ట్రస్థాయి నుంచి అందజేస్తారు. సమాచారం ఆధారంగా పీహెచ్‌సీ సిబ్బంది హైరిస్క్‌ గర్భిణులను డెలివరీ తేదీకి మూడు నుంచి నాలుగు రోజుల ముందే దగ్గరలోని ఏరియా, జిల్లా, అవసరాన్ని బట్టి బోధనాస్పత్రులకు తరలిస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేశారు. హైరిస్క్‌ గర్భిణి వాహనంలో పెద్దాస్పత్రికి తరలింపు, పెద్దాస్పత్రిలో అడ్మిట్‌ చేయడం, ప్రసవానంతరం ఫొటోలను యాప్‌లో సిబ్బంది అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే యాప్‌ ట్రయల్‌ రన్‌ సైతం పూర్తయింది. చిన్నచిన్న మార్పు చేర్పులను చేస్తున్నారు.

అందుబాటులోకి కాల్‌ సెంటర్‌
మరోవైపు గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యంపై వాకబు చేయడం కోసం వైద్య శాఖ ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. రెండు షిఫ్టుల్లో 80 మంది సిబ్బంది కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్నారు. రాత్రివేళల్లో అత్యవసర సేవల కోసం కొందరు సిబ్బంది కాల్‌సెంటర్‌లో ఉంటున్నారు. గర్భిణులు, బాలింతలకు ఏఎన్‌సీ, పీఎన్‌సీ, ఇతర వైద్యసేవల కల్పన, చిన్నారులకు ఇమ్యునైజేషన్‌ వంటి ఇతర అంశాలను కాల్‌సెంటర్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హైరిస్క్‌ గర్భిణులపై కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.  

మాత, శిశు మరణాల కట్టడి కోసమే
మాతా, శిశు మరణాల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హైరిస్క్‌ గర్భిణులపై ఫోకస్‌ పెంచుతున్నాం. వారికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రసవానికి ముందే వారిని పెద్దాస్పత్రులకు తరలించడం కోసం పీహెచ్‌సీలకు నిధులు మంజూరు చేయనున్నాం.
– జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top