కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ కొత్త రికార్డు

Andhra Pradesh Vaccinates Record 13 Lakhs In Single Day - Sakshi

రికార్డ్ సృష్టించిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

జాతీయ స్థాయిలో ఒకేరోజు అత్యధికంగా ఏపీలో వ్యాక్సినేషన్

ఒక్కరోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్

సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల్లో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిన ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌లో మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా నేడు కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఒకేరోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు వేసి రికార్డులు సృష్టించి దేశంలోనే నంబర్‌వన్ గా ఉన్న ఏపీ సర్కార్ నేడు తన రికార్డును తానే అధిగమించి వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డులను తిరగరాసింది.

ఉద్యమంగా ప్రజలకు చేరువయ్యేలా..
రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఆదివారం వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. సుమారు 8 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ అందించేలా పకడ్బందీగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకి లక్ష్యాన్ని నిర్దేశిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్యర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్యమంగా ప్రజలకు చేరువయ్యేలా  అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ పదమూడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 2232 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక డ్రైవ్‌గా నిర్వహించింది. వాస్తవానికి నిర్దేశించుకున్న 8 లక్షల లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం 2 గంటలకే చేరుకుంది. సాయంత్రం వ్యాక్సినేషన్ ముగిసే సమయానికి నిర్దేశించిన లక్ష్యానికి మించి 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి తాము గతంలో వేసిన 6 లక్షల రికార్డ్‌ని తిరగరాశారు. రాష్ట్రంలో కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన పరిస్థితుల్లో ముందుస్తుగానే వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న సీఎం జగన్ ఆదేశాలతో నేడు వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అవ్వడానికి కారణమైంది.

ఒకే రోజు 13 లక్షల మందికి..
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాక్సిననేషన్‌ను వైద్య, ఆరోగ్యశాఖ కార్యరూపంలోకి తీసుకువచ్చింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లు, ఎఎన్‌ఎంలకు వ్యాక్సినేషన్‌లో అవసరమైన శిక్షణను అందించడం, ప్రతి యాభై ఇళ్లకు నియమించిన వాలంటీర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం వల్ల ఒకేరోజు 13 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించే సామర్థ్యాన్ని ఏపీ సొంతం చేసుకుంది. స్పెషల్ డ్రైవ్‌లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో లక్షన్నర మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో1.45 లక్షల మందికి, కృష్ణాలో 1.30 లక్షలు, విశాఖలో 1.10 లక్షలు.. గుంటూరులో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ధర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్‌లో ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షలకి పైగా చిన్నారుల తల్లులు ఉంటారని గుర్తించి ఇప్పటికే 5.5 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్‌లో మరో ఐదు లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని తెలిపారు.

జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డు..
ఇదిలా ఉంటె  గత రెండు స్పెషల్ డ్రైవ్ లలో ఒకేరోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ అందించి వైద్య, ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం తమ సామర్ద్యాన్ని చాటుకుంది. నేడు ఆ రికార్డులను తిరగ రాసేలా  పదమూడు లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం జాతీయ స్థాయిలోనే కొత్త రికార్డును సృష్టించింది. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందాలన్న నిర్ణయంలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి జిల్లాలకు వ్యాక్సిన్‌ అత్యంత తక్కువ సమయంలోనే రవాణా  అవుతోంది. కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్‌ను గన్నవరం విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వ్యాక్సిన్ స్టోరేజీ సెంటర్‌కు తరలించడం, అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు ఎటువంటి జాప్యం లేకుండా కేటాయించిన డోసులను తరలించేందుకు పటిష్టమైన నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

స్పెషల్ డ్రైవ్‌కి అనూహ్య స్పందన..
గన్నవరం సెంటర్‌ నుంచి ఆయా జిల్లాలకు వ్యాక్సిన్ చేరుకున్న వెంటనే, జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలకు వాటిని పంపిణీ చేయడం, మరోవైపు వ్యాక్సిన్ వేసేందుకు ఆయా కేంద్రాల్లో ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ సేపు కూడా వ్యాక్సిన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక ప్రణాళికాబద్దంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు.  ఇక ప్రస్తుతం ఏ కేంద్రంలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారో ముందుస్తుగానే వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియచేస్తుండటంతో, ప్రజలకు  చేరువగానే ఏర్పాటు చేసే శిబిరాల్లో వ్యాక్సిన్ అందించే ప్రక్రియని అధికార యంత్రాంగం చేపడుతోంది. అందరి సమిష్టి కృషితో తాము ఈ సరికొత్త రికార్డు సాధించగలిగామని.. ప్రజల నుంచి స్పెషల్ డ్రైవ్‌కి అనూహ్య స్పందన లభించిందని. అన్ని విభాగాలు మెగా స్పెషల్ డ్రైవ్లో భాగస్వామ్యమయ్యాయని ఏపి ఎల్త్ డైరక్టర్ డాక్టర్ గీతాప్రసాదిని తెలిపారు. మొత్తానికి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డ్రైవ్ సత్ఫాలితాల్ని ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సమాయత్తం చేస్తూ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తిస్ధాయిలో విజయవంతం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top