
సాక్షి,విజయవాడ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు తీసుకువచ్చిన దొంగ ఓటర్లకు పోలీసులు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని, పోలీసుల అండతోనే యథేచ్ఛగా వారు ఓటు వేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సెగ్మెంట్‌లో తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, మరోవైపు కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానివ్వకుండా డీఐజీ కోయ ప్రవీణ్ కాపలా కాయడం దారుణమని అన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంకు వస్తున్న కార్యకర్తలను కాల్చేస్తానంటూ డీఎస్పీ బెదిరించడం ఈ ఎన్నికల్లో పోలీసులు అధికారపార్టీకి ఎంత తొత్తులుగా మారి పనిచేస్తున్నారనడానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...
2017 లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా దారుణంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్‌లో పాల్గొన్న వారు అక్కడి సెగ్మెంట్లకు చెందిన వారు కాదు. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, రౌడీలను తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి మా పార్టీ నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫొటోలతో సహా బయటపెట్టారు. దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తుల పేర్లతో సహా వెల్లడించారు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి. పులివెందుల్లో ఉన్న 10,601 ఓట్లలో యాబై శాతంకు మించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో వేయించారు. పులివెందుల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకోలేకపోయారు. పోలీస్ యంత్రాంగం వైఎస్సార్‌సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా బయట తిరగనివ్వకుండా నిర్భందించారు.
ఎంపీ అవినాష్‌రెడ్డిపై ఆంక్షలు:
కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకువెడుతున్నారో కూడా చెప్పకుండా గంటల తరబడి వాహనాల్లో తిప్పారు. దీనిని పార్టీ నేతలు ప్రశ్నించడంతో ఎర్రగుంట్లలో ఓ పార్టీ నాయకుడి ఇంటిలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల పార్టీ కార్యాలయంకు వచ్చారు. ఈ సమాచారం తెలియగానే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడికి వచ్చి నేను కూడా మీ పార్టీ కార్యాలయంలోనే కూర్చుంటాను అంటూ కూర్చున్నారు. ఒకవైపు రెండు సెగ్మెంట్లలోనూ టీడీపీ వారు విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తుంటే, దానిని అడ్డుకోకుండా, వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీ అవినాష్‌రెడ్డి బయటకు రాకుండా కాపలా కాస్తూ కూర్చుంటాను అని కోయ ప్రవీణ్ అనడం చూస్తుంటేనే వారి కుట్రలు అర్థమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ వారిని ఎవరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళనివ్వవద్దని, టీడీపీ దొంగ ఓట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని ఆయన ఆదేశాలు ఇచ్చేశారు. ఆయన ఖాకీ చొక్కాకు బదులు పచ్చ చొక్కా వేసుకున్నట్లుగా, తెలుగుదేశం ఏజెంట్‌గా, కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇంత కన్నా దిగాజరుడుతనం ఎక్కడైనా ఉంటుందా? టీడీపీని గెలిపించేందుకు ఐపీఎస్ అధికారి డీఐజీ కోయ ప్రవీణ్ దిగజారి వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రజాస్వామికవాదులు మరిచిపోతారా? పోలీసులే దొంగ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు తమ హక్కులను కాపాడాలని ఓటర్లు పోలీసులు కాళ్ళు పట్టుకుని ప్రాదేయపడుతున్నా వారు పట్టించుకోవడం లేదు.
మా పార్టీ ఆఫీస్‌కే వచ్చి... మా కార్యకర్తలనే కాల్చేస్తామని వార్నింగ్:
వైఎస్సార్‌సీపీ కార్యాలయానికే వచ్చి పార్టీ కార్యకర్తలను 'నా కొడకల్లారా.... కాల్చిపారేస్తాను' అంటూ పులివెందుల్లో డీఎస్పీ హెచ్చరించారు. పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ప్రజలను కాల్చిపారేయడానికేనా? చంద్రబాబు, డీఐజీ ప్రవీణ్ అండగా ఉన్నారన్న అహంకారమా? వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు వెళ్ళి, వారి కార్యాలయంలో ఒకవైపు ఎంపీ ఉండగానే, బయట ఉన్న కార్యకర్తలను కాల్చి పారేస్తాను అంటూ హెచ్చరించడం డిఎస్పీ అహంకారానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే ఖాకీదుస్తులు వేసుకుంటున్నారా? దానికి బదులు పచ్చచొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను ఎన్నికల్లో చూడలేదు. రెండు జెడ్పీటీసీల కోసం చంద్రబాబు ఇంత కక్కుర్తి పడాలా? వందేళ్ళ పాటు ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళారు. చరిత్ర హీనుడుగా మిగిలిపోతున్నాడు. ఈ సంప్రదాయం చంద్రబాబు, ఆయన కుమారుడిని వెంటాడదా? ఈ పరిణామాలను చూస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల గుండెలు మండిపోతున్నాయి.
డీఐజీ కోయ ప్రవీణ్‌ను చూస్తుంటే సిగ్గేస్తోంది:
వైఎస్ అవినాష్‌ను పోలీసులు వెంటాడుతున్నారు. ఏకంగా ఆయన ఉన్న పార్టీ ఆఫీస్‌లోనే కూర్చుని, ఆయనను గమనించేందుకు డీఐజీ తెగబడ్డారు. మరోవైపు ఇరవై కార్లతో జమ్మలమడుగు ఎమ్మెల్యే తిరుగుతున్నా, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కాన్వాయితో తిరుగుతున్నా పోలీసులకు కనిపించదు. యధేచ్ఛగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైనం వారికి కనిపించదు. డీఐజీ కోయ ప్రవీణ్ ఉద్యోగ ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇటువంటి అధికారిని చూస్తుంటే సిగ్గేస్తుంది. అవినాష్‌రెడ్డి బయటకు వెళ్ళి, జరుగుతున్న తప్పులను పట్టుకుంటారేమోనని భయపడుతున్నారు. మహిళలు తమ హక్కును కాపాడాలని ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. జమ్మలమడుగు టీడీపీకి చెందిన ఉపాధ్యక్షుడు పులివెందుల ఎన్నికల్లో ఓటు వేశాడంటేనే ఈ ఎన్నిక ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. దీనిని డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.