పడిగాపులు.. పడరాని పాట్లు | - | Sakshi
Sakshi News home page

పడిగాపులు.. పడరాని పాట్లు

Jun 20 2026 5:46 AM | Updated on Jun 20 2026 5:46 AM

అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రిలో నెలకొన్న అధ్వాన పరిస్థితులు రోగులు, వారి సహాయకులను చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రధానంగా స్కానింగ్‌కు రెఫర్‌ చేసినప్పుడు పరిస్థితి దారుణంగా తయారై ఘర్షణ పడాల్సి వస్తోంది. ఇది ప్రతి రోజూ కొనసాగుతూ వస్తున్నా సంబంధిత అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇరుకై న గదుల్లో స్కానింగ్‌ సెంటర్లు నిర్వహిస్తుండడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కొన్నేళ్లుగా ఒకే గదిలో 2డీ ఎకో, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహిస్తున్నారు. గదిలో ఇద్దరు, ముగ్గురుకంటే ఎక్కువ మంది ఉండలేని పరిస్థితి. ఒకేసారి ముగ్గురు రోగులను లోపలికి అనుమతించడంతో పాటు వారి సహాయకులు కూడా వెంట ఉండాల్సి వస్తోంది. దీంతో గందగోళం నెలకొని స్కానింగ్‌ ఆలస్యమవుతోంది. ఈ క్రమంలోనే గది బయట వేచి ఉండే రోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే ఏ ఒక్కరికీ టోకన్లు ఇవ్వకుండా అందరినీ వేచి ఉండాలని చెప్పడం తప్ప స్కానింగ్‌ వేగవంతం చేసే చర్యలు ఏవీ చేపట్టకపోవడంతో రోగులు, వారి సహాయకుల్లో అసహనం రేకెత్తుతోంది. గది బయట స్కానింగ్‌ రోగులు కిక్కిరిసి ఉండడంతో ఇతర వార్డులకు వెళ్లే వారికీ తిప్పలు తప్పడం లేదు.

వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత

స్కానింగ్‌ కోసం గంటల తరబడి వేచి ఉన్న తమను కాదని వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత నిస్తున్నారంటూ తరచూ రోగుల సహాయకులు వాగ్వాదానికి దిగుతున్నారు. అత్యవసరమంటూ కొందరు.... ఆస్పత్రి సిబ్బంది సిఫారసులతో వెనకొచ్చిన మరికొందరు దర్జాగా గదిలోకి చొరబడి స్కానింగ్‌ చేయించుకుని వెళుతుంటే తాము మాత్రం మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. టోకన్లు అందజేసి, ఆ మేరకు స్కానింగ్‌ నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు.

సర్వజనాస్పత్రిలో స్కానింగ్‌ కష్టాలు

రోగులకు తప్పని అవస్థలు

సిఫారసులకు తలొగ్గి వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న సిబ్బంది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement