
ఎవరికీ భయపడం: అనంత వెంకటరామిరెడ్డి
గుంతకల్లు: ‘అలవిగాని హామీలతో గద్దెనెక్కడం.. తరువాత వాటిని పక్కన పెట్టడం బాబు నైజం. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన అబద్ధపు హామీలు లెక్కేస్తే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎక్కడం ఖాయం’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్‌రెడ్డి అన్నారు. గుంతకల్లు పట్టణంలోని ఆర్‌టీసీ డిపో సమీపంలోని పీఎంఆర్ కన్వెన్షన్ హాలులో మంగళవారం మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సతీష్‌రెడ్డితోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజనాథ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఇస్తామన్న బాబు అధికారంలోకి వచ్చాక మొహం చాటేశారన్నారు. ‘దీపం’ పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నాడని, కానీ నేడు సగం మందికి కూడా పథకం డబ్బులు అందలేదని విమర్శించారు. పింఛను పంపిణీ గురించి గొప్పగా చెప్పుకుంటున్న బాబు.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వాటి కంటే ఒక్క కొత్త పింఛన్ అయిన మంజూరు చేశారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు’ కార్యక్రమం చేపట్టాక కిందికి దిగొచ్చి అరకొరగా తల్లికి వందనం పథకం అమలు చేశారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 87 లక్షల మంది విద్యార్థులకు రూ.13,500 కోట్లు అవసర ముంటే, కేవలం రూ.8,000 కోట్లు విడుదల చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఇన్ని డబ్బులొస్తాయని గతంలో టీడీపీ నాయకులు బాండ్లు పంచారని, హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకొని అడగాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే అన్ని వర్గాల ప్రజలూ కూటమి ప్రజాప్రతినిధుల కాలర్ పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారన్నారు. రాయలసీమలోని ఏ ప్రాజెక్టుకూ పైసా కూడా ఇవ్వని చంద్రబాబు పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నమ్మగలమా అని పేర్కొన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఈ ఏడాదిలో ఒక్క అభివృద్ధి పని చేపట్టారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ 2.0లో ఒకపక్క ప్రజలు.. మరో పక్క కార్యకర్తలు అనే నినాదంతో పార్టీ ముందుకు పోతుందని చెప్పారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేశారట.. ఎవరూ వీటిపై అడగరాదట. ఆరు పథకాలు ఏఏ ఇంటికి పోయాయో చర్చించేందుకు మేం రెడీగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎన్.గాదిలింగేశ్వరబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామాంజినేయులు, పట్టణ, రూరల్ అధ్యక్షులు ఖలీల్, రాము, గుత్తి జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్, పార్టీ నేతల పామిడి వీరా, వైఎస్సార్ సీపీ సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ఏడాది పాలనలో
ప్రజలకు చేసిన మంచి శూన్యం
రాయలసీమకు తీరని అన్యాయం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్‌రెడ్డి మండిపాటు
గుంతకల్లులో పార్టీ
విస్తృత స్థాయి సమావేశం
వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తమ పార్టీ నుంచి గెంటేస్తే గుంతకల్లులో పడిన గుమ్మనూరు జయరాం.. నేడు వైఎస్సార్‌సీపీ నాయకుల కాళ్లు, చేతులు విరుస్తామంటున్నారని, ఆయనకు గుంతకల్లు నియోజకవర్గ ప్రజల గురించి తెలియనట్లుగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కొడితే ఆలూరు కాదు ఎక్కడ పడతాడో కూడా తెలియదని హెచ్చరించారు. గుంతకల్లు నియోజక వర్గంలో ప్రతి మండలానికీ తమ్ముళ్లను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించుకొని దోపిడీ చేస్తున్నారన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ పై అధికారుల ఆదేశాలు పాటించాలి కానీ, ఎమ్మెల్యేలు చెప్పినట్లు నడుచుకోకూడదని హితవు పలికారు. చట్టాలు తమకు కూడా తెలుసని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టులకు ఈడుస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ విధా నాలను ఎండగట్టడానికి ప్రతి కార్యకర్త ఇంటింటికీ తిరగాలని ‘అనంత’ పిలుపునిచ్చారు.