
మంత్రి కేశవ్‌కు సమస్యల ఏకరవు
కూడేరు: మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వివరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏకరవు పెట్టారు. కూడేరు మండలం జయపురంలో బుధవారం మంత్రి కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరూ ఆయనను కలిసి, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రోజూ ఉదయం 6 గంటలకే పంచాయతీల్లో ఉండాలని, చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దిన పత్రిక పట్టుకొని నోట్ కమ్ ఫొటో దిగాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీ రాజ్ కమిషనర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించినట్లు గుర్తు చేశారు. రోజూ ఉదయం 6 గంటలకే వెళ్లడం చాలా ఇబ్బందవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలను వేరు చేసి పంచాయతీరాజ్ పనులను మాత్రమే తమకు అప్పగించేలా చూడాలని విన్నవించారు. స్పందించిన మంత్రి.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి చొరవ తీసుకుంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, కార్యదర్శులు రాఘవ, నాగరాజు, హరీష్, వెంకటనారాయణ,రమాదేవి, సుభాషిణి, లక్ష్మీకాంతమ్మ, సూర్య తదితరులు పాల్గొన్నారు.