
రాకెట్లలో దళిత యువ రైతుపై దాడి
ఉరవకొండ: మండలంలోని రాకెట్లలో దళిత యువ రైతు హనుమంతుపై అదే గ్రామానికి చెందిన చిన్న సుంకప్ప కుటుంబసభ్యులు దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... రాకెట్లలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న దళిత వెంకటేష్ కుమారులు హనుమంతు, రామాంజనేయులు కలిసి ఇటీవల నెట్టం రాధాకృష్ణ నుంచి సర్వేనంబర్ 320–బీ1లోని 74 సెంట్లలో 15 సెంట్లను కొనుగోలు చేశారు. ఈ స్థలానికి చెక్కు బందీ మేరకు దక్షిణం వైపు బండి రస్తా ఉంది. భూమి విక్రయించే ముందు రాధాకృష్ణ కుటుంబసభ్యులు చూపించిన సర్వే హద్దుల్లోనే హనుమంతు సోదరులు పంట దిగుబడిని, పశువుల మేత వామిని హనుమంతు వేశాడు. అయితే ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన చిన్న గుండ్లొల్ల చిన్న సుంకప్ప కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితం దౌర్జన్యంగా ఆక్రమించి, అందులో ఎరువులను, మట్టిని వేసుకున్నారు. తమ స్థలంలోకి ఎందుకు చొరబడుతున్నారని అడిగితే.. ఇది మాదే స్థలం అంటూ ఎదురు తిరిగారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో మరోమారు మరికొంత స్థలాన్ని ఆక్రమించేందుకు ముళ్లకంపలు తొలగించడంతో హనుమంతు గమనించి ప్రశ్నించాడు. అంతే చిన్న సుంకప్ప, ఆయన కుటుంబ సభ్యులు చందు, మణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాదిగ లం... కొ.. అంటూ దూషణలకు పాల్పడటమే కాకుండా కిందపడేసి చెప్పులతో కొట్టారు. కాసేపటి తర్వాత పెదనాన్న, పెద్దమ్మ వచ్చి అతడిని వారి నుంచి విడిపించుకుని ఇంటికి తీసుకెళ్లారు. అయినా శాంతించని చిన్నసుంకప్ప కుటుంబ సభ్యులు మరోమారు ఇంటిలోకి చొరబడి హనుమంతుపై చెప్పులు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ రాత్రి భయంభయంగా గడిపిన బాధితుడు బుధవారం మధ్యాహ్నం ఉరవకొండ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తమ భూమిలోకి అకారణంగా ప్రవేశించి, ఆక్రమణకు పాల్పడి, ఇదేమని అడిగిన తనపై చెప్పులతో దాడిచేసి, కులం పేరుతో దూషించారని, వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.