
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లోని గైనిక్ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో రోగికి ప్రాణం పోశారు. వివరాలు... గుత్తికి చెందిన లక్ష్మి గత నెల 23న ఆయాసం, రక్త హీనతతో బాధపడుతూ జీజీహెచ్‌లోని గైనిక్ ఓపీకి వచ్చింది. ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని,, పలు రకాల స్కానింగ్‌లు నిర్వహించారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 4.3 ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పాటు గర్భసంచికి రెండు వైపులా భారీ పరిమాణంలో కణితులు పెరిగినట్లుగా గుర్తించారు. విషయాన్ని గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం దృష్టికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ బేగం, అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య తీసుకెళ్లి చర్చించారు. తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేయలేమని హెచ్‌బీ 10 శాతానికి చేరుకున్న తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రక్తం ఎక్కిస్తూ వచ్చారు. హిమోగ్లోబిన్ శాతం మెరుగు పడిన తర్వాత బుధవారం డాక్టర్ షంషాద్‌బేగం నేతృత్వంలో డాక్టర్ నిస్సార్ బేగం, డాక్టర్ సౌజన్య, పీజీలు డాక్టర్ ఊర్మిళ, డాక్టర్ రమణి, అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్ర, స్టాఫ్‌నర్సులు సుప్రియ, ఉషారాణి బృందంగా ఏర్పడి శస్త్రచికిత్స చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి 6 కిలోల బరువున్న భారీ కణితులను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం లక్ష్మి ఆరోగ్యం కుదుట పడుతోందని డాక్టర్ షంషాద్ బేగం తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అయ్యే ఈ తరహా శస్త్రచికిత్సను సర్వజనాస్పత్రిలో పూర్తి ఉచితంగా చేసినట్లు తెలిపారు. తొలగించిన కణితిని బయాప్సీకి పంపామని, క్యాన్సర్ నిర్ధారణ అయితే తదుపరి చికిత్సకు రెఫర్ చేస్తామని పేర్కొన్నారు.