
వజ్రకరూరు సర్పంచ్‌కు జాతీయ స్థాయి అవార్డు
వజ్రకరూరు: ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో డాన్‌బాస్క్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన షీరెప్రెజెంట్స్–2025 శిక్షణా తరగతులకు హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసాకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. మొత్తం 45 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఈ శిక్షణా తరగతులకు హాజరు కాగా, జూన్ 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ అవగాహన కల్పించారు. ప్రధానంగా పాలన, కమ్యూనికేషన్, ప్రజా నైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు–వాటి పరిష్కారాలు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, మహిళా సంఘాల బలోపేతం అంశాలపై మోనాలిసా మాట్లాడారు. దీంతో ఆమెను అవార్డుకు నిర్వాహకులు ఎంపిక చేసి, బెస్ట్ ఫర్మార్మెన్స్ అవార్డును అందజేశారు.