
రమణీయం.. పూరీ జగన్నాథుడి రథోత్సవం
అనంతపురం కల్చరల్: ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరేరామ హరే కృష్ణ నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. పూరీ జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని అనంతపురం భక్తిసాగరంలో మునిగితేలింది. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పవిత్ర నదీజలాలతో సంప్రోక్షణ అనంతరం స్థానిక కేఎస్‌ఆర్ కళాశాల వద్ద రథోత్సవాన్ని సత్యగోపీనాథ్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. సప్తగిరి సర్కిల్ నుంచి పాతూరు, శ్రీకంఠం సర్కిల్,ఆర్ట్స్ కళాశాల, టవర్ క్లాక్ మీదుగా వెళ్లి లలితళాపరిషత్తు వరకు రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా రథం ముందు కళాకారులు సందడి చేశారు. చెక్కభజన, దేవతామూర్తుల వేషధారులు, కోలాటం, గురవయ్యలు, ఉరుముల కళాకారులు అద్భుతంగా కళారూపాలను ప్రదర్శించారు. నాట్యాచార్యులు దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో కళాకారులు శాసీ్త్రయ నృత్యాలతో జగన్నాథుడికి భక్తి నీరాజనాలర్పించారు. ఇస్కాన్ విశిష్టతను తెలియజేశారు.
● అంతకుముందు లలితకళాపరిషత్తులో ఇస్కాన్ మందిర ఇన్‌చార్జ్ దామోదర గౌరంగదాసు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన సినీనటుడు సుమన్, సత్యగోపీనాథ్ మాట్లాడుతూ ఇస్కాన్ సేవలు అమూల్యమన్నారు. రథయాత్రలో కుల మతాలకతీతంగా ప్రజలు పాల్గొనడం సంతోషం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో పర్చూరు నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రమణీయం.. పూరీ జగన్నాథుడి రథోత్సవం

రమణీయం.. పూరీ జగన్నాథుడి రథోత్సవం