
తాడిపత్రి వెళ్తా.. అనుమతివ్వండి
● ఎస్పీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణానికి వెళ్లేందుకు తనకు అనుమతి కావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీకి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ ఆంక్షలతో ఆయన తాడిపత్రికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పట్టణానికి వెళ్లేందుకు కోర్టులు అనుమతి ఇచ్చినా పోలీసులు వివిధ కారణాలు చూపుతూ అడ్డుకుంటున్న తరుణంలో పెద్దారెడ్డి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని లేఖలో పెద్దారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా తాడిపత్రిలో కార్యక్రమం చేపట్టాల్సి ఉందన్నారు. తాను దాదాపు 3 రోజుల పాటు పట్టణంలో ఉండాల్సి ఉంటుందన్నారు. కావున తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి కావాలని పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌లో
10,089 కేసుల పరిష్కారం
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 10,089 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌ను ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులో కేసులు పరిష్కారమైతే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుందని, అదే లోక్ అదాలత్‌లో అయితే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
● ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మోటారు వాహనాల ప్రమాద కేసులు 28 పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.1.57 కోట్ల నష్ట పరిహారం ఇప్పించారు. సివిల్ కేసులు 75 పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.5,35,59,388. ప్రీలిటిగేషన్ కేసులు 3,876 పరిష్కారం కాగా, ఇందులో మొత్తం రూ.1,98,98,382. ఎన్‌ఐ యాక్ట్ కేసులు– 22 మొత్తం రూ.31,50,000.
రేపు పామిడిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 7వ తేదీ సోమవారం పామిడి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు.
1100కు కాల్ చేయండి
అర్జీదారులు 1100కు ఫోన్ చేసి పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అర్జీలను సమర్పించి పరిష్కారం పొందవచ్చన్నారు.

తాడిపత్రి వెళ్తా.. అనుమతివ్వండి