దేవరకొండకు తూట్లు | - | Sakshi
Sakshi News home page

దేవరకొండకు తూట్లు

Jul 6 2025 6:51 AM | Updated on Jul 6 2025 6:51 AM

దేవరక

దేవరకొండకు తూట్లు

అది ఒక కొండ కాదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొలిచే దేవతా స్వరూపం. కరువు నుంచి రక్షించే ‘దొణ తిమ్మరాయస్వామి దేవరకొండ’. తరతరాలుగా పూజలందుకుంటున్న ఈ కొండను ప్రజలు ‘ద్యావుర బండ’ అని పిలుచుకొని కొలుచుకుంటారు. అలాంటి ప్రజల విశ్వాసంపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తూటాలు (బండను పేల్చే పేలుడు పదార్థాలు) పేలుస్తుండటం ఆయా గ్రామాల ప్రజలకు నిద్రపట్టకుండా చేస్తోంది.

శెట్టూరు: మండలంలోని ఐదుకల్లు, యాటకల్లు, మంగంపల్లి, ఉప్పొంక గ్రామాల మధ్య సర్వే నంబర్‌ 185లో సువిశాలమైన విస్తీర్ణంలో కొండ (ద్యావుర బండ) ఉంది. కొండపై తిమ్మరాయప్ప పాదం, స్వామివారి గుర్రం పాదం గుర్తులు ఉన్నాయి. వీటికి రైతులు ఉత్తరకార్తెలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీడీపీ నాయకులకు ఈ కొండపై కన్ను పడింది. కొండను తవ్వి కంకర అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. ఇందు కోసం క్వారీ నిర్వహణకు అనుమతుల కోసం పావులు కదిపారు. కొండకు ఆనుకుని ఉన్న ఇద్దరు రైతుల డీ–పట్టా పొలాలను లీజుకు తీసుకుని.. అందులో క్రషర్‌ యంత్ర సామగ్రిని సమకూర్చారు. కొండకు చుట్టుపక్కలన్నీ సాగు భూములే. 70కి పైగా మామిడి తోటలు, 300కు పైగా బోరు బావులు ఉన్నాయి. క్వారీ నిర్వహణ విషయం రైతులకు ఏమాత్రం తెలియదు. అధికారులు కూడా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినా సరే అధికార పార్టీ నాయకులు బండకు తూట్లు పొడుస్తున్నారు. బండను పేల్చే సమయంలో పొలాల్లోకి రాళ్లు ఎగిరి పడటం.. క్రషింగ్‌ చేసేటపుడు దుమ్ము, ధూళి పంటలను కప్పేయడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు.

కొండకాదు మా దేవత....

దేవర కొండను తాము కొండగా చూడబోమని, దేవతగా ఆరాధిస్తామని ప్రజలు తెలిపారు. పురాతన కాలం నుంచి కొండపై వెలసిన దొణ తిమ్మప్పను పూజిస్తున్నట్లు చెప్పారు. ఐదుకల్లు, యాటకల్లు, మంగంపల్లి, ఉప్పొంక గ్రామాల రైతులను రక్షించే దైవం, ఇక్కడ వర్షాలు లేక కరువు వస్తే ఈ కొండపైకి వచ్చి తిమ్మప్పస్వామికి పూజలు చేసి, వంట వండి నైవేద్యం సమర్పిస్తే.. తిరిగి ఇంటికి వెళ్లేలోపే వర్షం పడేదని చెబుతున్నారు. కొండపై పూరాతన మాగాణి (పంటలు పండే భూమి) ఉండేదని, పూర్వానికి ఏడు గ్రామాల ప్రజలు ఇక్కడ నివసించి ఆహార ధాన్యాలు పండించేవారని గుర్తు చేస్తున్నారు.

మామిడితోటే నా జీవనాధారం

దేవరబండ అనే కొండకు ఆనుకుని నాకు ఏడు ఎకరాల పొలం ఉంది. ఐదేళ్ల క్రితం తోటలో మామిడి మొక్కలు నాటాను. ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. అయితే ఇక్కడి కొండపై పేలుడు పదార్థాలు పెట్టి బండను పేలుస్తున్నారు. దీనివల్ల దుమ్ము, ధూళి వచ్చి మామిడి చెట్లపై పడుతోంది. దీనివల్ల కాపు రాకుండా పోతోంది. ఇక్కడ కంకర మిషన్‌ నిర్వహస్తే నా తోటపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. ఈ కొండను తవ్వేందుకు అధికారులు అనుమతులు ఇవ్వరాదు.

– రామాంజనేయులు, రైతు, ఐదుకల్లు

పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం

నేను ఐదురోజుల క్రితం తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నా. క్వారీ నిర్వహణ, అనుమతులు విషయం ఏవీ తెలియదు. నా దృష్టకి వస్తే పరిశీలించి.. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసు కుని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా.

– ఈశ్వరమ్మ, తహసీల్దార్‌, శెట్టూరు

కొండపై ‘దొణ’లే జీవనాధారం...

టీడీపీ నేతల నిర్వాకం

సమీప పంట పొలాలకు దెబ్బ

చుట్టుపక్కల 4 గ్రామాల వరకు ఎఫెక్ట్‌..

క్వారీ నిర్వహించరాదంటున్న రైతులు

తిమ్మప్పకొండపై ఉన్న లోతైన దొణలు ఎప్పటికీ ఎండిపోవని, స్వచ్ఛమైన నీరు అప్పుడు, ఇప్పుడు ప్రజలకు జీవనాధారంగా ఉందని ప్రజలు తెలిపారు. కొండ ఇంతటి నీటిని పట్టి ఉంచటం వల్లే మా గ్రామాల్లో భూగర్భజలాలు ఎక్కువగా ఉన్నాయని, వన్యప్రాణులు అధిక సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. పొలాల్లో ఉన్న రైతులకు ఈ ‘దొణ’ల్లోని నీరే దాహం తీర్చుతుందన్నారు. ప్రస్తుతం కూడా ఈ కొండపై పెద్ద నీటి ట్యాంకు నిర్మించారని, ఈ ట్యాంక్‌ నుంచే గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. ఇలాంటి కొండపై పేలుళ్లు జరిపి కంకర తీసుకొని కొండను నేలమట్టం చేయాలనే ఆలోచనను టీడీపీ నాయకులు విరమించు కోవాలని వేడుకుంటున్నారు.

దేవరకొండకు తూట్లు 1
1/1

దేవరకొండకు తూట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement