
రగులుతున్న కుంపట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య కలహాల కుంపట్లు రాజుకున్నాయి. ఓవైపు హామీలు అమలు చేయలేదని సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఎమ్మెల్యేలపై సొంతపార్టీలోనే అసమ్మతుల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్యులకు హామీలు అమలు చేయాల్సిన ఎమ్మెల్యేలు నిత్యం రాజకీయ గొడవలతో ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడంలోనే సమయం సరిపోతోంది. సొంత పార్టీలోనే కార్యకర్తలు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. స్వయానా ఎమ్మెల్యేలే ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో తమ ఊరికి వచ్చినా కార్యకర్తలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
దగ్గుపాటికి ఆది నుంచీ అసమ్మతి పోరు..
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజునుంచీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దగ్గుపాటి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభాకర్‌పై కూడా దగ్గుపాటి ఫిర్యాదులు చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దగ్గుపాటిపై ఆరోపణలు వచ్చాయి. ఆ మరుసటి రోజే పాతూరులో ప్రభాకర్‌చౌదరి అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గీయులు వీడియోలను వైరల్ చేశారు. తాజాగా దగ్గుపాటికి సుధాకర్‌నాయుడు లాంటి నేతలు కూడా సొంత పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్ర వేసుకున్నారు.
శ్రావణిశ్రీపై ఫిర్యాదుల వెల్లువ..
శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీపై రోజురోజుకూ అసమ్మతి వెల్లువెత్తుతోంది. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ విచ్చలవిడి అయ్యింది. ఎమ్మెల్యే తల్లి వసూళ్లకు పాల్పడుతోందంటూ ఏకంగా ఇన్‌చార్జ్ మంత్రి టీజీ భరత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఇక్కడ కేశవరెడ్డి, నరసా నాయుడుతో కూడిన టీడీపీ ద్విసభ్య కమిటీ ఉంది. ఈ కమిటీ సభ్యుల అనుచరులకు కనీస విలువ ఇవ్వడం లేదని శ్రావణిశ్రీపై ఫిర్యాదు చేస్తున్నారు. నియోజకవర్గంలో వసూళ్లు తప్ప సొంత పార్టీ కార్యకర్తలకు ఏమాత్రమూ విలువ ఇవ్వడం లేదంటూ పలువురు కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
అమిలినేనికి ఈ–స్టాంప్ బ్రేకులు..
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు ఇటీవల ఈ–స్టాంప్‌ల కుంభకోణం మకిలి అంటుకుంది. ఇందులో తన ప్రమేయం లేదంటూ టీడీపీలోనే తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు ఉన్నం మారుతీ చౌదరి పేరును తెరమీదకు తెచ్చారు. తనకంటూ సొంత పార్టీలో ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈయన పేరు బయటకు తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నం వర్గీయులకు సంబంధించి ఏ ఒక్కపనికీ ఎమ్మెల్యే సహకరించడం లేదని ఉన్నం ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి పనిచేసిన వారికి సొంతపార్టీ నాయకులే విలువనివ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఏడాది పాలన సందర్భంగా ఇంటింటికీ వెళుతున్న సమయంలోనూ ఎమ్మెల్యేలకు సొంతపార్టీ కార్యకర్తలు సహకరించడం లేదు.
అంతర్గత విభేదాలతో
నలిగిపోతున్న టీడీపీ కార్యకర్తలు
మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ
బండారు శ్రావణిశ్రీపై ఫిర్యాదుల పర్వం
తొలి నుంచీ అనంతపురం అర్బన్‌లో దగ్గుపాటి, వైకుంఠం మధ్య
ఆగని పోరు
పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపులో నువ్వంటే నువ్వేనని రచ్చకెక్కిన పరిస్థితి
కళ్యాణదుర్గంలో అమిలినేని.. ఉన్నం మారుతీ చౌదరి మధ్య తారస్థాయికి వర్గపోరు
నాయకుల మధ్య వైరంతో కార్యకర్తల్లో రోజురోజుకూ పెరుగుతున్న అసహనం