
పచ్చ నేతల పైశాచికం
డీ హీరేహాళ్(రాయదుర్గం): అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమ దందాలకు అడ్డు చెప్పే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మట్టి దందాపై సమాచారమిచ్చారన్న కోపంతో రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు దౌర్జన్యంగా తొలగించారు. రాయదుర్గం నియోజకవర్గం డీ హీరేహాళ్ మండలం దొడగట్టలో జరిగిన ఈ ఘటన అధికార పార్టీ నేతల దాష్టీకాలకు పరాకాష్టగా నిలుస్తోంది. వివరాలు.. దొడగట్ట చెరువులో కొద్ది రోజులుగా భారీ ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీలతో టిప్పర్లలోకి లోడ్‌చేసి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సండూరు, రాంపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు ఒక్కో ట్రిప్పు మట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా వెనుక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు ఆ ప్రాంతమంతా కోడై కూస్తోంది.
మెట్టుతో కలిసి పట్టించారనే కోపంతో..
మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టిన దొడగట్ట చెరువును నాలుగు రోజుల క్రితం రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దులో మార్తల్ వద్ద నిల్వచేసిన సుమారు వంద ట్రిప్పుల మట్టిని పరిశీలించారు. అక్కడి నుంచే కళ్యాణదుర్గం ఆర్డీఓ, రాయదుర్గం రూరల్ సీఐ, మైనర్ ఇరిగేషన్ డీఈ తదితరులకు ఫోన్ చేసి.. అక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మెట్టుతో కలిసి తమ దందాను బట్టబయలు చేశారనే అక్కసుతో రైతులపై టీడీపీ నాయకులు కక్ష సాధింపులకు దిగారు. విద్యుత్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చెరువులో బోర్లు ఉన్నాయనే సాకుతో రైతులు ఈశ్వరప్ప, పెద్ద అంజినేయులు, మేటి బసవరాజు, వండ్రప్పకు చెందిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తొలగించి సర్వీసులు నిలిపివేయించారు. టీడీపీ నాయకుల దాష్టీకం కారణంగా పొలాల్లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంట ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరీ ఇంత దారుణమా?
టీడీపీ నాయకుల దందాను బయటపెట్టారనే అక్కసుతో రైతుల విద్యుత్ కనెక్షన్లు తొలగించడం దారుణమని వైఎస్సార్ సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి మండిపడ్డారు. తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ అమల్లోకి తెచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం రైతుల్ని కూడా వదలడం లేదని మండిపడ్డారు. మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి దారుణానికి ఒడిగట్టారన్నారు. విప్ కాలవ శ్రీనివాసులుకు ఇలాంటి దారుణాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
రైతుల వ్యవసాయ
విద్యుత్ కనెక్షన్ల తొలగింపు
మట్టి దందాపై సమాచారమిచ్చారన్న అక్కసుతో దాష్టీకం

పచ్చ నేతల పైశాచికం