
కూటమి అవినీతిని ప్రజలకు తెలపండి
కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వ అవినీతి, మోసాలను ప్రజలకు తెలియపరచాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శ్రీనివాస కల్యాణ మండపంలో పార్టీ కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ పార్టీ శ్రేణులు 30 రోజుల పాటు ఇంటింటికీ తిరగాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన మంచిని వివరిస్తూ ఏడాదిలో చంద్రబాబు చేసిన మోసాలను, మేనిఫెస్టోను తెలియజేయాలని సూచించారు. అనంతరం... రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్‌ను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ కుటుంబానికి ఎంత మోసం జరిగిందో తెలుసుకునేలా ప్రజలను చైతన్య వంతులు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు నారాయణపురం వెంకటేశులు, రామాంజినేయులుతో పాటు వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి