
నేడు ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
ఉరవకొండ: నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం స్థానిక గవిమఠం సమీపంలోని వీరశైవ కల్యాణ మండపంలో జరగనుంది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే విశ్వ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మేలో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20)(ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15), (ఆర్–19) సప్లిమెంటరీ, బీటెక్ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. అలాగే, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్ సప్లిమెంటరీ, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ, బీఫార్మసీ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. ఫలితాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్ తదితరులున్నారు.
ఏఎఫ్ ఎకాలజీ మల్లారెడ్డికి
సైబర్ నేరగాళ్ల టోకరా
● మొబైల్ హ్యాక్ చేసి రూ. 8.50 లక్షల అపహరణ
రాప్తాడురూరల్: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి సైబర్ నేరస్తుల ఉచ్చులో పడ్డారు. రూ. 8.50 లక్షల డబ్బు పొగోట్టుకున్నారు. ఇటుకలపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన మేరకు.. ఐదు రోజుల క్రితం మల్లారెడ్డి మొబైల్‌కు కిసాన్ రైతు పేరుతో ‘ఏపీకే’ ఫైలు వచ్చింది. మల్లారెడ్డి ఆ ఫైలు ఓపెన్ చేయగా.. ఆయన మొబైల్ హ్యాక్ అయింది. ఆ తర్వాత మల్లారెడ్డి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 8.50 లక్షలు హ్యాకర్లు వేరే అకౌంటుకు బదిలీ చేసుకున్నారు. గుర్తించిన మల్లారెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు కిసాన్ పేరుతో వచ్చే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని ఎస్‌ఐ విజయ్‌కుమార్ సూచించారు. మొబైల్ ఒక సారి హ్యాక్ చేశారంటే సమాచారం మొత్తం కొల్లగొడతారని, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.