
యువకుడి మృతదేహం వెలికితీత
రాయదుర్గం టౌన్: స్థానిక దుగ్గిలమ్మ గుడి కోనేరులో స్నేహితులతో కలసి ఈతకు వెళ్లి గల్లంతైన బోయ రాజశేఖర్ (30) రెండో రోజు గురువారం మృతదేహమై నీటిలో తేలియాడుతూ కనిపించాడు. ఈత రాకపోయినా స్నేహితుల ఒత్తిళ్ల కారణంగా బుధవారం బావిలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గురువారం తెల్లవారుజాము నుంచినాలుగు భారీ స్థాయి ఆయిల్ మోటార్లతో బావిలో నీటిని బయటకు తోడేశారు. ఈ క్రమంలో దాదాపు 20 అడుగులకు పైగా నీటిని తోడిన తర్వాత గురువారం రాత్రి 8.30 గంటలకు రాజశేఖర్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి అంబులెన్సులో స్థానిక ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.