
నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం
ఉరవకొండ/ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం వైభవంగా జరగనుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. దీంతో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి పెన్నహోబిలం ఆలయానికి ప్రత్యేకంగా 42 ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ హంపయ్య తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది తెలిపారు.