
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
● 4.5 కిలోల వెండి సామగ్రి, తులం బంగారం స్వాధీనం
కళ్యాణదుర్గం రూరల్: నియోజవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితల వివరాలను ఏఎస్‌ఐ రామాంజనేయులుతో కలసి సీఐ వంశీకృష్ణ వెల్లడించారు. కళ్యాణదుర్గం రూరల్, కంబదూరు పీఎస్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా దేవాలయాల్లో చోరీలు జరిగాయి.రెండు స్టేషన్ల పరిధిలో మొత్తం నాలుగు కేసులు నమోదుకాగా, డీఎస్పీ రవిబాబు ఽపర్యవేక్షణలో రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఆలయాల్లో చోరీలకు పాల్పడింది తామేనని అంగీకరించారు. పట్టుబడిన వారిలో ఆరుల రాజశేఖర్, గొల్ల బొబ్బిలి రాము ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల వెండి సామగ్రి, ఒక తులం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, ఇదే కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. విజయనగరం జిల్లాకు చెందిన వీరు సంచార జీవనం సాగిస్తూ ఓ ప్రాంతంలో కొన్ని నెలల పాటు తిష్ట వేసి, ఆ ప్రాంతంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడేవారు. వీరికి ఆధార్‌కార్డులు లేకపోవడంతో చోరీ జరిగిన సమయంలో వేలి ముద్రలు లభ్యమైనా ఆచూకీ దొరకకుండా తప్పించుకుని తిరిగేవారని పోలీసులు తెలిపారు.