
ఏడాదిలో అనంత రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తి
● కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న
అనంతపురం సిటీ: అమృత్ భారత్ పథకం కింద అనంతపురం రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను 2026 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తెలిపారు. శుక్రవారం ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి స్థానిక రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే శాఖ అధికారులు, ఇంజినీర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అంబికాతో కలసి విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం రైల్వే స్టేషన్ విస్తరణలో భాగంగా తొలి విడతలో రూ.30 కోట్లు, మలి విడతలో రూ.22 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఎస్కలేటర్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. పుట్టపర్తి–బెంగళూరు మధ్య నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అనంతపురానికి మరిన్ని రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అనంతపురంలో హాల్ట్ కల్పించాలని, ధర్మవరం–మచిలీపట్నం రైలుకు రాయలచెరువు స్టేషన్‌లో స్టాపింగ్‌కు చొరవ చూపాలని విన్నవించారు. గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
వాహనం బోల్తా.. ఒకరి మృతి
తాడిపత్రి: మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్‌బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.