
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్‌టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. అలాగే పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లు అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 68 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు, 43 ఫార్మసీ కళాశాలలు, 24 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఏటా 1.30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. జేఎన్‌టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్ , పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో గణనీయమైన ర్యాంకు దక్కించుకుని అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.
చేయూత అ‘పూర్వ’ం
క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వర్సిటీ పురోగతికి చేయూతనందించారు. రూ.8 కోట్ల వ్యయంతో 100 గదులతో కూడిన హాస్టల్‌ను పూర్వ విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్‌నూ ఏర్పాటు చేశారు.
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ
జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాలలో 2024–25లో బీటెక్ పూర్తి చేసిన మొత్తం 226 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చాటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 10 మందికి ఏడాదికి రూ.11 లక్షల వేతనంతో కూడిన కొలువులు దక్కడం విశేషం.
జేఎన్‌టీయూ బంగారాలు:
జేఎన్‌టీయూ అనంతపురం వర్సిటీ పరిధిలో 18 మందికి, జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాల పరిధిలో ఏడుగురికి మొత్తం 49 బంగారు పతకాలు, ఎంటెక్‌లో ఒకరు, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదుగురి బంగారు పతకాలు దక్కాయి. వీరిలో జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి ఏకంగా ఆరు బంగారు పతకాలు దక్కించుకుని వర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాన్పూర్‌లోని ఐఐటీలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ హాజరుకానున్నారు. అలాగే జేఎన్‌టీయూ (ఏ) పాలకమండలి సభ్యులు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ముఖ్య అతిథిగా హాజరవుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపన్యాసం చేయనున్నారు. లైవ్‌స్ట్రీమ్ ద్వారా స్నాతకోత్సవాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు.
అగ్రగామిగా తీర్చిదిద్దాలి
అన్ని రంగాల్లో జేఎన్‌టీయూ (ఏ)అగ్రగామిగా తీర్చిదిద్దాలని వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. శుక్రవారం ఆయన జేఎన్‌టీయూలోని పాలకభవనంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికలో సమూలంగా మార్పు చేశామన్నారు. గౌరవ డాక్టరేట్‌ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేయడం గర్వంగా ఉందన్నారు. స్నాతకోత్సవ సందర్భంగా డిగ్రీలు అందుకునే విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.
నేడు జేఎన్‌టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం
చాన్సలర్ హోదాలో ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్
40,109 మంది విద్యార్థులకు డిగ్రీలు, 167 మందికి పీహెచ్‌డీల ప్రదానం

కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూ

కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూ

కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్‌టీయూ