
దోమ తెరలను సక్రమంగా వినియోగించుకోవాలి
అనకాపల్లి: జిల్లాలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలకు పంపిణీ చేసిన దోమతెరలను విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి, ఇతరలకు సాయం చేసేలా ఎదగాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రెండవ సంవత్సరంలో జిల్లాలో అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌లో విద్యార్థులకు 10,429 దోమతెరలను పంపిణీ చేసినట్టు చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో వీటిని అందజేసినట్టు తెలిపారు. జిల్లాలో 50 వెనుకబడిన తరగతి సంక్షేమ వసతి గృహాలకు 2,400 దోమ తెరలు, 30 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 2,122, ఐదు మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ సంక్షేమ వసతి గృహాలకు 1,075 తెరలు, 19 గిరిజన సంక్షేమ వసతి గృహాలకు 1,220, ఎనిమిది సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు 1,712 తెరలు, 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 1,700, నాలుగు ఆశ్రమ పాఠశాలలకు 200 చొప్పున పంపిణీ చేసినట్టు చెప్పారు. ప్రతి విద్యార్థి దోమ తెరను వినియోగించేలా వసతి గృహ సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జి.రామారావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రసాద్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రామానందం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్