
రారండోయ్.. వేడుక చూద్దాం..
డాబాగార్డెన్స్: టౌన్కొత్తరోడ్డులో వెలసిన చారిత్రక జగన్నాథస్వామి ఆలయంలో వార్షిక రథయాత్ర మహోత్సవాలు ఈ నెల 24 నుంచి జూలై 8 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 185 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరిగే ఈ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24న మంగళవారం జ్యేష్ట బహుళ చతుర్దశి నాడు ప్రతిష్టా ప్రారంభ సంకల్పం, 25న అమావాస్య నాడు ఉదయం జలాధివాసములు, క్షీరాధివాసములు, రాత్రి విశేష హోమాలు, 26న ఆషాడ శుద్ధ పాడ్యమి నాడు ఉదయం పూర్ణాహుతి, నేత్రోత్సవం, సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం, సుభద్రాదేవి శాంతి కల్యాణం జరపనున్నారు. 27న ఉదయం 9.10 గంటలకు స్వామిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు భక్తుల జయజయధ్వానాల మధ్య తొలి రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది.
టర్నర్ చౌల్ట్రీలో దశావతార దర్శనం
ఈ నెల 28 నుంచి జూలై 6వ తేదీ వరకు టర్నర్ చౌల్ట్రీ కల్యాణ మండపంలో జగన్నాథస్వామి భక్తులకు పది దివ్య అవతారాల్లో నయనానందకరంగా దర్శనమిస్తారు. 28న మత్స్యావతారం, 29న కూర్మావతారం, 30న వరాహావతారం, జూలై 1న నృసింహావతారం, 2న వామనావతారం, 3న పరశురామావతారం, 4న శ్రీరామావతారం, 5న బలరామ, శ్రీకృష్ణావతారం, 6న తొలి ఏకాదశి సందర్భంగా శేషపాన్పు అవతారంలో స్వామిని అలంకరిస్తారు.
తిరుగు రథయాత్ర
జూలై 7 న ఉదయం 9.45 గంటలకు స్వామి వారిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు టర్నర్ చౌల్ట్రీ నుంచి మేళ తాళాలు, బాణసంచా వెలుగుల మధ్య జై జగన్నాథ్ నామస్మరణతో తిరుగు రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 8న సంప్రోక్షణ అనంతరం స్వామిని యథాస్థానంలో పీఠారోహణం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
భక్తులకు సూచనలు
● ఈ నెల 28 నుంచి జూలై 6 వరకు ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణం, సామూహిక భగవద్గీత, విష్ణు పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
● తొమ్మిది రోజుల పాటు తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకోవాలనుకునే భక్తులు రూ. 500 చెల్లించి దేవస్థానం కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు.
● దశావతార అలంకరణలు చేయించదలచిన భక్తులు ఆలయ ఈవో టి.రాజగోపాలరెడ్డిని కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.
ఆలయముఖ ద్వారం
24 నుంచి జగన్నాథస్వామి
రథయాత్ర ఉత్సవాలు
27న తొలి రథయాత్ర
28 నుంచి స్వామి దశావతారాలు

రారండోయ్.. వేడుక చూద్దాం..

రారండోయ్.. వేడుక చూద్దాం..

రారండోయ్.. వేడుక చూద్దాం..