
ఈదురు గాలులు, భారీ వర్షం
రాజవొమ్మంగి/కొయ్యూరు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఈదుగాలులతో భారీ వర్షం పడింది. రాజవొమ్మంగి మండలంలోని చెరకుంపాలెం, జడ్డంగి పరిసర ప్రాంతాల్లో పెద్ద పెట్టున గాలులు వీయడంతో తాటాకు ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. చెరకుంపాలెంలోని అంగన్‌వాడీ కేంద్రంపై చెట్టు కూలిపోయింది. ఇదే ప్రాంగణంలోని అంగన్‌వాడీ వంట షెడ్డు రేకులు గాలికి ఎగిరి దూరంగా పడ్డాయి. కేంద్రం భవనం చుట్టూ నీరు చేరింది. ఆ సమయంలో పిల్లలు ఎవరూ కేంద్రంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జడ్డంగి పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. రాజవొమ్మంగిలో గంటన్నరకు పైగా వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
● మండల కేంద్రం కొయ్యూరు, పరిసర గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాయగా, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది.
స్తంభించిన జన జీవనం
రంపచోడవరం: మారేడుమిల్లిలో మంగళవారం మధ్యాహ్నం ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం స్తంభించింది. ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వైపు వెళ్లే వాహనాలు, మారేడుమిల్లి నుంచి ఘాట్ గుండా చింతూరు వైపు వెళ్లే వాహనాలను వర్షం తగ్గే వరకు నిలిపివేశారు.

ఈదురు గాలులు, భారీ వర్షం

ఈదురు గాలులు, భారీ వర్షం

ఈదురు గాలులు, భారీ వర్షం