
ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
అరకులోయటౌన్: ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకే వందశాతం ఉద్యోగాలు కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు. మే 2 నుంచి నిర్వహించే రాష్ట్ర మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గిరిజన సంఘం, ఉద్యోగ సంఘాలు, పీఆర్‌టీయూ, యూటీఎఫ్,ఆదివాసీ పరిరక్షణ సమితి, మాతృ బహుభాషా ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘం, పీసా కమిటీ ప్రతినిధులతో స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడారు. డీఎస్సీలో జిల్లాలో ఎస్టీలకు కేవలం 24 పోస్టులు మాత్రమే కేటాయించారని, ఆదివాసీలకు 6 శాతం, గిరిజనేతరులకు 94 శాతం పోస్టులు కేటాయించడం వల్ల ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ విడుదల చేసి ప్రత్యేక డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, వివిధ సంఘాల నాయకులు వంతాల అరుణ్, ప్రకాష్, పుడిగి దేముడు, చట్టూ మోహన్, రమేష్, నాగేంద్ర, జగన్నాథం, రామారావు, పోతురాజు, సురేష్, సతీష్, కుమార్, రాజ పాల్గొన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్