ఏజెన్సీలో టవర్రీ | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో టవర్రీ

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

న్యూస్‌రీల్‌

పోలవరం
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026
ఫ కనెట్‌ కాక..

పరిమితంగా సిగ్నల్స్‌

జిల్లాలోని ఎగువ ప్రాంతంలో ఉన్న రాజవొమ్మంగి, వై.రామవరం మండలాల్లో బీఎస్‌ఎన్‌ల్‌ సేవల పరిస్థితి దారుణంగా ఉంది. సెల్‌ టవర్లు ఉన్నా కేవలం మీటర్ల దూరంలో మాత్రమే సిగ్నల్స్‌ అందుతున్నాయని, అటవీ ప్రాంతాల్లో కేవలం గ్రామం వరకు మాత్రమే సిగ్నల్స్‌ పరిమితమవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు చింతూరు డివిజన్‌లో 65 బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లుండగా వాటిలో 4జీ టవర్లు 57 ఉన్నాయి. డివిజన్‌ కేంద్రమైన చింతూరులో రెండు నెలలుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించిన అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ తెలంగాణ నుంచి జాతీయ రహదారి 30 వెంబడి చింతూరుకు వస్తుంది. రెండేళ్లుగా ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడం, తవ్వకాల సమయంలో కేబుల్‌ తెగిపోయి సిగ్నల్స్‌ నిలిచిపోతున్నాయి.

పనిచేయన్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌

నిత్యం మొరాయిస్తున్న వైనం

ప్రజల తీవ్ర అవస్థలు

చింతూరు: ఆధునిక కాలంలో సెల్‌ఫోన్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకోబోయే వరకూ, అర్ధరాత్రి అత్యవసర సమయంలోనూ దీని అవసరం చాలా ఉంటుంది. జేబులో రూపాయి లేకపోయినా పర్వాలేదు గానీ సెల్‌ఫోన్‌ లేకపోతే బతకడం చాలా కష్టం. దీనికి అనుగుణంగానే వివిధ కంపెనీలు నెట్‌ వర్క్‌లను విస్తరించుకుంటూ వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. కానీ పోలవరం జిల్లాల్లో మాత్రం సెల్‌ సిగ్నల్స్‌ (నెట్‌ వర్క్‌) వ్యవస్థ సక్రమంగా పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

12 మండలాల్లో..

జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 450కి పైగా బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లున్నాయి. వీటి పరిధిలో ఆయా మండలాల్లో లక్ష మందికి పైగా వినియోగదారులు సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్‌ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంటే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా 2జీ, 3జీ నెట్‌వర్క్‌ సేవలే అందుతున్నాయి. ఇటీవల చాలా టవర్లను 4జీగా అప్‌గ్రేడ్‌ చేసినా సరైన రీతిలో సేవలు అందించడం లేదు.

బ్రాడ్‌బ్యాండ్‌ సేవలూ అంతే..

సెల్‌ సిగ్నల్స్‌తో పాటు బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు కూడా నిలిచి పోతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చింతూరులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతో విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల బ్యాటరీలకు సంబంధించిన కాపర్‌ కేబుల్‌ చోరీకి గురై 20 గంటలకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఇక మారుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజుల తరబడి సేవలు నిలిచిపోతుండడంతో అత్యవసర సమయాల్లో సమాచారం ఇచ్చేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నామని వినియోగదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

చింతూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు జియో, ఎయిర్‌టెల్‌, వీఐ (వొడాఫోన్‌, ఇండియా) టవర్లు వున్నాయి. వీటిలో జియో ఆపరేటర్‌పై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం 4జీ సేవలతో జియో టవర్‌ నిర్మాణం కాగా నేటికీ అవే 4జీ సేవలు కొనసాగుతున్నాయి. ఇతర నెట్‌వర్క్‌లకు చెందిన వినియోదారులను ఆకట్టుకునేందుకు త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశచూపడంతో చాలామంది నంబరు పోర్టబులిటీ ద్వారా జియో నెట్‌వర్క్‌లోకి మారారు. ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ 5జీ సేవలు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఎయిర్‌టెల్‌ వినియోగదారుల పరిస్థితి కూడా ఇదే రీతిలో వుంది. వాయిస్‌ కాల్స్‌ అప్పడప్పుడూ మొరాయించినా ఈ రెండు నెట్‌వర్క్‌లకు సంబంధించి ఇంటర్నెట్‌ సేవలు చాలా దారుణంగా వున్నాయి. టవర్ల ప్రారంభ సమయంలో 20 ఎంబీకి పైగా వున్న ఇంటర్నెట్‌ వేగం ప్రస్తుతం 5 ఎంబీ కంటే దిగువకు పడిపోయిందని, ఒక్కోసారి కేబీల్లో చూపిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

సిగ్నల్స్‌ దారుణం

మెరుగైన సేవలు అందిస్తారనే ఆశతో ఇతర నెట్‌వర్క్‌ నుంచి జియోకు మారాను. ఇంటర్నెట్‌ వేగం చాలా తక్కువగా ఉంటోంది. ప్రారంభంలో బాగానే వున్నా ఇటీవల చాలా దారుణంగా పడిపోయింది. 5జీ సేవలు ఇస్తామని చెబితే జియో నెట్‌వర్క్‌లోకి మారినా నేటికీ 4జీ సేవలు మాత్రమే అందిస్తున్నారు.

– మల్లెల్లి ప్రదీప్‌, చింతూరు

నెట్‌వర్క్‌ మెరుగుపరచాలి

మా ప్రాంతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సరిగా పనిచేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రైవేటు నెట్‌వర్క్‌లకు సంబంధించిన సిమ్‌లు కొనుగోలు చేస్తున్నాం. నెట్‌వర్క్‌ వ్యవస్థను మెరుగుపరిచి సేవలను విస్తరిస్తే బాగుంటుంది. –గోరా అప్పలస్వామి,

అప్పలరాజుపేట, రాజవొమ్మంగి మండలం

గ్రామానికే పరిమితం

సెల్‌ సిగ్నల్స్‌ కేవలం టవర్‌ ఉన్న గ్రామానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఊరు దాటితే సిగ్నల్‌ అందడం లేదు. అత్యవసర సమయాల్లో సిగ్నల్‌ వున్న ప్రాంతాలకు వెళ్లి మాట్లాడాల్సి వస్తోంది. ఆపరేటర్లు సేవలను విస్తరించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.

– పయ్యాల నాగేశ్వరరావు,

చింతూరు

మొరాయింపు

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ నిత్యం మొరాయిస్తుండడంతో జిల్లా పరిధిలోని ప్రజలతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ల్‌తో పాటు ప్రైవేటు ఆపరేటర్లకు సంబంధించిన టవర్లు సైతం వినియోగదారులుకు నాణ్యమైన సిగ్నల్స్‌ అందించడంలో విఫలమవుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత ఆపరేటర్లకు ఫిర్యాదు చేసినా సిగ్నల్‌ వ్యవస్థను మెరుగు పరచడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement