వై.రామవరం: పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భూరా రామ్ భైరవ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 90 సీట్లు ఉండగా, ఈ ఏడాది ఇదే పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణులైన 59 మంది విద్యార్థులకు కేటాయించామన్నారు. మిగిలిన 31 సీట్లను బయట పాఠశాలల నుంచి వచ్చే గిరిజన బాల బాలికలకు ఇస్తామన్నారు. వీటిలో 16 మంది బాలురు, 15 మంది బాలికలకు అవకాశం ఉందని, రాష్ట్ర బోర్డు, సీబీఎస్‌ఈ, ఇతర గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. పదో తరగతి మెరిట్ జాబితా ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆసక్తి కల విద్యార్థుల పాఠశాలలోని తమ కార్యాలయానికి వచ్చి వివరాలు తెలుసుకోవాలన్నారు.


