● వెదురు మొక్కల పెంపకంలో అశ్రద్ధ
● పైలెట్ ప్రాజెక్టులోనే హంసపాదు
● గిరిజనులకు చేకూరని ప్రయోజనం
అంతన్నారు.. ఇంతన్నారు.. గిరిజనులకు ఆర్థిక ప్రయోజనమే లక్ష్యమన్నారు.. చివరికి పథకాన్ని నీరుగార్చారు.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన వెదురు మొక్కల పెంపకంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.. ఇలా నిధులు వృథా చేసి, లక్ష్యాన్ని పక్కన బెట్టేశారు.
రంపచోడవరం: జిల్లాలో వెదురు మొక్కల పెంపకం ద్వారా గిరిజన రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకు రంపచోడవరం ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా వెదురు మొక్కలు పెంపకం చేపట్టేందుకు కార్యచరణ రూపొందించింది. ఉపాధి హామీ, వెలుగు సంయుక్తంగా రైతులను గుర్తించి వారికి మొక్కలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇలా రైతులకు వెదురు మొక్కలు అందజేసింది. ఈ పథకాన్ని ఐటీడీఏ అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోవడంతో లక్ష్యం నీరుగారింది.
జిల్లాలో పది వేల మంది రైతులతో 4 వేల ఎకరాల్లో వెదురు మొక్కలు నాటించేందుకు కార్యచరణ రూపొందించారు. ఇందులో భాగంగా మండలాల వారీగా రైతులను గుర్తించారు. ఒక్కో రైతు 37 సెంట్ల భూమిలో వెదురు మొక్కలు నాటుకునేందుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో రైతుకు 60 వెదురు మొక్కలు పంపిణీ చేస్తారు. దీని కోసం రైతు రూ.1,200 చెల్లించాలి. అయితే తిరిగి రైతు ఖాతాలో మొక్కలు కొనుగోలు కోసం ఇచ్చిన డబ్బులు జమ చేస్తారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లేందుకు వెలుగు, ఉపాధి హామీ పథకం, ఉద్యాన శాఖ, ఇండస్ట్రీ ఫౌండేషన్లను భాగస్వాములను చేశారు. వెలుగు సిబ్బంది రైతులకు వెదురు మొక్కలను అందజేస్తారు. ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటడానికి గోతులు తీసి మస్తర్లు నమోదు చేస్తారు. ఉద్యాన శాఖ వెదురు మొక్కలు నాటుకునే విధానం, పెంపకంపై అవగాహన కల్పిస్తారు. రైతులకు వెదురు మొక్కలను ఇండస్ట్రీ ఫౌండేషన్ సరఫరా చేస్తుంది. సమగ్ర ఇదీ ప్రాజెక్టు స్వరూపం. ఇందులో అడుగడుగడుగునా లోపాలే కనిపించాయి.
వర్షాలు పడని సమయంలో..
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో సుమారు 1,200 మంది రైతులకు వెదురు మొక్కలను గత ఏడాది సెప్టెంబర్‌లో అందజేశారు. వీటిని వర్షాలు లేని సమయంలో ఇవ్వడంతో మొక్కలను నాటుకునేందుకు రైతులు ఆసక్తి చూపలేదు. ఈ కారణాలతో మొక్కలు నాటకుండానే చాలాచోట్ల చనిపోయాయి. అలాగే నాటిన మొక్కలు దెబ్బతిన్నాయి. ఇచ్చిన మొక్కల్లో సుమారు 50 శాతంపైనే పాడయ్యాయి. మొక్కలు నాటేందుకు అనుకూలంగా లేని సమయంలో ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఒత్తిడి కారణంగానే సెప్టెంబర్ నెలలో మొక్కలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొక్కలు ఇచ్చినా వాటిని నాటుకున్నారో తేదో పరిశీలించకపోవడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వం వెదురు అభివృద్ధికి నేషనల్ బాంబో మిషన్ ఏర్పాటు చేసింది. వెదురు నాటిన రైతులకు నాలుగు సంవత్సరాల తర్వాత రూ.37,411 ఆదాయం వస్తుంది. 40 ఏళ్లు పాటు రాబడి రానుంది.
ఫలితం శూన్యం
ఏజెన్సీలో వెలుగు ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల ఫలితాలు శూన్యమే. వారు చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా గిరిజనులకు ఆర్థికంగా ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు. గతంలో జీడిపిక్కల ఫ్యాక్టరీ, జామాయిల్ మొక్కల పంపిణీ, ఇటుకల తయారీ పరిశ్రమ, పసుపు తయారీ, వెదురుతో కొవ్వొత్తుల తయారీ వంటి అనేకం ఉన్నాయి. ఏవీ మంచి ఫలితాలు ఇవ్వలేదు. పైలెట్ ప్రాజెక్టుపై శ్రద్ధ లేక నిరుపయోగం అయ్యింది.
– పండా రామకృష్ణదొర,
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ కన్వీనర్


